కామారెడ్డి/ ఖలీల్వాడి, ఏప్రిల్ 4 : రాష్ట్రంలో ఏ ఒక్కరికీ దృష్టి లోపం ఉండకూడదనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి జిల్లాల నిర్విఘ్నంగా సాగుతున్నది. గ్రామాల్లోనే శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను పంపిణీ చేస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. చిన్నచిన్న కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి శిబిరంలోనే మందులు ఇస్తున్నారు. అవసరమైన వారికి తక్షణమే కళ్లద్దాలు అందజేస్తున్నారు. అందుబాటులో లేకపోతే వివరాలను సేకరించి కళ్లద్దాల కోసం ఇండెంట్ పెడుతున్నారు. శిబిరాలను అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా 44 బృందాలతో 5,326 మందికి పరీక్షలు నిర్వహించారు. 659 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 2,75,040 మందికి పరీక్షలు నిర్వహించి 43,112 మంది కళ్ళద్దాలు పంపిణి చేసినట్లు డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 9,111 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 853 మందికి అద్దాలను అందించామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 3,81,414 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 73,330 మందికి కంటి అద్దాలను అందజేశామని వివరించారు.
కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్..
నేను ఇంటి కాడనే టైలరింగ్ పని చేస్తా.. కొన్ని రోజుల సంది కండ్లు మసక మసక కనవడుతున్నయ్. సర్కారోళ్లు పెట్టిన సెంటర్ల సూపిచ్చుకున్నా. డాక్టర్లు మంచిగ పరీక్షలు చేసిండ్రు. కళ్లద్దాలు, మందులు ఇచ్చిండ్రు. గిప్పుడైతే కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్. సీఎం సార్ మా అసుంటి గరీబోళ్లకు మస్తు సౌలత్ జేసిండు.
– దర్జి రమేశ్, చేతన్నగర్
పైసా ఖర్సు లేకుండా సూసిండ్రు
నాకు కండ్లు సరిగా కనిపిస్తలేవు.. ఈపుల, నెత్తిల మస్తు నొప్పి అయితున్నది. ఊర్ల సెంటర్ వెట్టుడుతోటి కండ్లు సూపిచుకున్న. నజర్ తక్క అయ్యిందని కళ్లద్దాలు ఇచ్చిండ్రు. గిప్పుడు మంచిగా కనవడుతున్నది. కేసీఆర్ సారు పుణ్యమా అని పైసా ఖర్సు లేకుండా ఇంటి కాడికి అచ్చి కళ్లద్దాలు ఇచ్చిండ్రు.
– గోదావరి, చేతన్నగర్