బాన్సువాడ, సెప్టెంబర్ 15: వసతి గృహాల్లో వంటతోపాటు విద్యార్థులకు వడ్డించే సమయంలో వా ర్డెన్లు కచ్చితంగా ఉండాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నాణ్యమైన సరుకులు, కూరగాయలను కొనుగోలు చేసి రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. గురువారం ఆయన బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం వండిన ఆహార ప దార్థాలు, మెనూ ప్రకారం పప్పు దినుసులు, మసాలాలను వాడారా అని సిబ్బంది, వార్డెన్‌ను ప్రశ్నించారు. స్టోర్ రూమ్‌లోని సరుకులను పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. పిల్లలు రాబోయే తరాల ఆస్తి అని పేర్కొన్నారు. వసతి గృహాల్లో ఉండే పిల్లలను కూడా మన సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని రకాల వసతులు, సదుపాయాలను కల్పిస్తోందన్నారు. నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వసతి గృహాల్లో లోపాలను పరిశీలించడానికే ఆకస్మిక తనిఖీలు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు పేదరికం నుంచి వచ్చిన వారే అని, మన పిల్లలు ఎంతో వారు కూడా అంతే అని పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం పెట్టడం మన బాధ్యత అని, వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వమే కావాల్సిన నిధులను మంజూరు చేస్తోందన్నారు. హాస్టల్ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వసతి గృహాలతోపాలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తాను హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని అన్నారు. సభాపతి వెంట ఆర్డీవో రాజాగౌడ్ , ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, విండో అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ, కౌన్సిలర్ హకీం, వార్డెన్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.