వినాయక్‌నగర్, జూలై 13 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న గుమ్మడిదారుల సంపత్‌కుమార్ (43) (హెచ్‌జీ-413) గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన సంపత్‌కుమార్ కంట్లో నుంచి నీరు కారుతున్నదని, చికిత్స కోసం నాందెడ్‌కు వెళ్తున్నట్లు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య ఉమకు చెప్పి బయల్దేరాడు. ఉదయం 7.30 గంటల సమయంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లోని 3వ నంబర్ ప్లాట్‌ఫాం పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో రైల్వే ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బ్యాగ్‌లో ఐడీకార్డుల ఆధారంగా హోంగార్డు సంపత్‌కుమార్‌గా గుర్తించి, విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు యశ్వంత్, కూతురు యశస్వి ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వేధింపులతోనే..?
ఆత్మహత్యకు పాల్పడిన హోంగార్డుకు అప్పులు ఉన్నట్లు కుటుంబీకుల ద్వారా తెలిసింది. ఇటీవల రూ.10 లక్షలు అప్పు ఉన్నాడని, కొంతమంది అతడి ఇంటికి వచ్చి గొడవచేసినట్లు మృతుడి భార్య పోలీసులతో తెలిపినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారి వేధింపులతోనే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.