Pitlam | కామారెడ్డి, పిట్లం, ఆగస్టు 4 : పిట్లం మండల వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 127 మి.మీ నుంచి 141.1 మి.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు సమాచారం. దీంతో పిట్లం మండలంలోని కాకి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పిట్లం-తిమ్మానగర్ గ్రామాల మధ్య ఉన్న వంతెనపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అలాగే కంబాపూర్ తదితర గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని పరిశీలించేందుకు ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ మహేందర్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి వంతెనలు, వాగుల పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు.