కొందరు అక్రమార్కులు బరి తెగించారు. కాసుల మోజులో.. బిడ్డ పుట్టక ముందే గుట్టు విప్పేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడో, మగో తేల్చేస్తున్నారు. ఈ క్రమంలో కళ్లు తెరవని బిడ్డని కడుపులోనే తుంచేస్తున్నారు. తల్లి కడుపు నుంచి బయట పడకుండానే గర్భస్థ శిశువులకు ‘పిండం’ పెట్టేస్తున్నారు. ఇంతటి దారుణాలకు కామారెడ్డి కేంద్రంగా మారింది. లింగ నిర్ధారణ పరీక్షల కోసం పక్క జిల్లాలే కాదు, పొరుగు రాష్ర్టాల నుంచీ కస్టమర్ల రాక పెరిగింది. తరచూ లింగ నిర్ధారణ కేసులు వెలుగు చూస్తుండడం, అదే వ్యక్తులు పదేపదే పట్టుబడుతుండడం సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నది. మొదటిసారి పట్టుబడినప్పుడే కఠిన చర్యలు చేపట్టక పోవడంతో అక్రమార్కుల్లో భయం లేకుండా పోయింది.
-నిజామాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కొంత మంది అక్రమార్కులు పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. మొన్ననే గాంధారి మండల వైద్యాధికారి.. లింగ నిర్ధారణ కేసులో పట్టుబడి జైలుకు వెళ్లిన ఘటన మరువక ముందే మరో వైద్యుడి లీలలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి కేసుల్లో పట్టుబడిన సదరు వ్యక్తి.. చేసిన తప్పులనే పదే పదే చేస్తూ చట్టానికే సవాల్ విసురుతున్నాడు.
పైగా మొబైల్ సేవలు కూడా అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పల్లెలతో పాటు పక్క జిల్లాలు, సరిహద్దు రాష్ర్టాల్లో బ్రోకర్లను పెట్టుకుని అక్రమాలకు తెర లేపారు. గర్భిణులను కామారెడ్డికి తరలించి కడుపులో ఉన్నది ఆడబిడ్డ, మగబిడ్డనా? అని తేల్చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. ఈ మధ్యే వెలుగు చూసిన ఘటనలో మహారాష్ట్ర నుంచి ఓ జంట వచ్చి గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నది. అయితే, ఇది తెలిసి మహారాష్ట్ర పోలీసులు వచ్చి వైద్యుడ్ని అరెస్టు చేయడంతో జిల్లాలో జరుగుతున్న దారుణాలు బయటకొచ్చాయి.
ప్రైవేటు దవాఖానలతో వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారంలో ఇంటి దొంగల హస్తమున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. వైద్యారోగ్య అధికారులు, పోలీసులు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎంతకూ అక్రమాలకు కళ్లెం పడడం లేదు. ముఖ్యంగా దాడులకు సంబంధించిన సమాచారాన్ని కొందరు వైద్యారోగ్య శాఖ సిబ్బంది ముందుగానే బయటికి చెప్పేస్తున్నారని, తద్వారా అక్రమార్కులు చిక్కకుండా తప్పించుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. కలెక్టర్ లేదా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగితేనే కానీ లింగ నిర్ధారణ దందాలో గొలుసు కట్టు సంబంధాలను నియంత్రించలేని పరిస్థితి నెలకొన్నది. లేదంటే తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి.
కామారెడ్డి అడ్డాగా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ దండుకుంటున్నారు. పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డనో తేల్చేస్తున్నారు. ఆడబిడ్డ అని తేలిన దంపతులు గర్భస్థ శిశువును వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు అక్రమంగా అబార్షన్లు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుకోకుండా గర్భం దాల్చిన పెళ్లి కాని యువతుల పరిస్థితిని అవకాశంగా మలుచుకుంటున్నారు. భారీగా డబ్బులు వసూలు చేస్తూ పిండాన్ని తుంచేస్తున్నారు.
భర్తకు తెలియకుండా గర్భం దాల్చిన ఓ వివాహిత ఇటీవల గర్భవిచ్ఛిత్తి చేయించుకోగా, ఈ దారుణంపై భర్త పోలీసులను ఆశ్రయించడంతో కామారెడ్డిలో అబార్షన్ల దందా మరోసారి చర్చనీయాంశమైంది. మరోవైపు, శిశు విక్రయాలు సైతం గతంలో వెలుగు చూసిన ఉదంతాలు ఉన్నాయి. బిడ్డలు అవసరం లేని గర్భిణులు ప్రసవం కాగానే వదిలించుకోవడం, ఆ నవజాత శిశువులను దవాఖాన నిర్వాహకులు వేలానికి పెట్టిన ఘటనలు వెలుగు చూశాయి. లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లు, శిశు విక్రయాలకు సంబంధించి కేసులు సైతం నమోదయ్యాయి. అయితే, మొదట్లోనే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే మళ్లీ ఇలాంటి ఉదంతాలు జరిగేవి కావు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల కాసుల కక్కుర్తిని అవకాశంగా మలుచుకుని అవే తప్పులు చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా లింగ నిర్ధారణ పరీక్షలకు కేంద్రంగా మారిన తరుణంలో పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అటు వైద్యారోగ్య శాఖ, ఇటు పోలీసు శాఖ దవాఖానలు, స్కానింగ్ సెంటర్లు, అక్రమార్కులపై నిఘా పెట్టాల్సి ఉండగా, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంపింగ్ వంటి చిన్న చిన్న నేరాలకే సామాన్యులను సతాయిస్తున్న పోలీసులు.. గర్భస్థ శిశువుల గుట్టు తేల్చే వైద్యులు, పిండానికే పిండం పెట్టే డాక్టర్లను పట్టుకోవడం, కఠినంగా శిక్షలు పడేలా చేయడం చేతకాక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి కేసు వెలుగు చూసినప్పుడే సంబంధీకులను గట్టిగా బిగిస్తే ఉన్న ఈ అక్రమాలకు అవకాశమే ఉండేది కాదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. మరోవైపు, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారితో పాటు పరీక్షలు చేయించుకుంటున్న వారిని సైతం కేసుల్లో ఇరికిస్తే, మిగతా వారు ముందుకొచ్చే వీలుండదని సామాజిక వేత్తలు చెబుతున్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే దవాఖానల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో పాటు కేసులు సైతం పెడతాం. జిల్లాలో ఈ పరీక్షల నియంత్రణకు కమిటీ ఉన్నా ఈ విషయంలో మాకు ఫిర్యాదులు రావడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు తీసుకుంటాం.
– చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి