సిటీబ్యూరో/ఖైరతాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలు చెప్పుకునే ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసిందని, బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇన్ఫెక్షన్కు గురైన 10 మంది బాలింతలు ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఒక మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, కనీసం ఒక ఉన్నతాధికారి కూడా వచ్చి బాధితులను పరామర్శించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నేరపూరితమైన నిర్లక్షమేనని మండిపడ్డారు.
బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో సర్జరీ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలింతలను, కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి ఆయన సోమవారం పరామర్శించారు. అనంతరం మాజీ హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. బాన్సువాడ దవాఖానకు ప్రసవం కోసం వెళ్లిన 10 మంది మహిళలకు సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారని చెప్పారు. ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఐసీయూ లో చికిత్స పొందుతున్నారన్నారు. అసలు ఈ సంఘటన ఎందు కు జరిగింది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అని తెలుసుకునే కనీస ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని, దీనిపై ఇప్పటివరకు పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించకపోవడం చాలా దారుణమన్నారు.
బాలింతలు పూర్తిగా కోలుకోకపోతే రేపు ఆ పసిపిల్లల పరిస్థితి ఏమిటని, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బ తింటాయో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలన్నారు. 10వ తేదీన ఆరుగురికి సిజేరియన్ చేసినప్పుడు వారికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా, అదే థియేటర్లో మళ్ళీ మరో నలుగురికి సిజేరియన్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఆపరేషన్ థియేటర్లో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకిందని, డాక్టర్ల నిర్లక్ష్యానికి తాము బలయ్యామని బాధిత కుటుంబాలు చెబుతున్నాయని, కాలం చెల్లిన మందులు వాడటం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. 10మంది బాలింతలు ప్రాణపాయ స్థితికి చేరుకున్న ఘటనను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది? దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ దవాఖానలను గాలికి వదిలేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్, పుట్టగానే కేసీఆర్ కిట్ ఇచ్చామని, ఆరోగ్యలక్ష్మి పథకం కింద పాలు, పౌష్టికాహారాన్ని అందించామని గుర్తుచేశారు. కాం గ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు కేవలం 30-35% ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానిని 72 శాతానికి తీసుకువెళ్ళామని, కానీ ఈరోజు మళ్ళీ అది 50 శాతానికి పడిపోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. ఆరోగ్య పథకాలలలో వేటిని కూడా బంద్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటారు, కానీ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ బంద్ చేశారని గుర్తు చేశారు. , ప్రభుత్వ దవాఖానల్లో మందులు సకాలంలో లేకపోవడం వల్ల రోగులకు నమ్మకం సన్నగిల్లి డెలివరీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మదర్ మోర్టాలిటీ రేటును 92శాతం నుంచి 43శాతానికి తగ్గించి, దేశంలోనే మూడవ ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని, కానీ నేటీ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలకు సుస్తీ పట్టిందని ఎద్దేవ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డి, జూలై 20: సిజేరియన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులకు న్యా యం జరిగే వరకు అండగా ఉంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరామర్శించారు.