స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా… స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా అన్నాడో కవి. తల్లి లాలన, తండ్రి పాలన, బంధువుల ఆప్యాయం ఇవన్నీ స్నేహం ముందు చిన్నబోతాయంటారు. అనిర్వచనీయమైనది స్నేహం… అజరామరమైనది స్నేహం… జీవితమిచ్చేది స్నేహం… జీవితాంతం కలిసుండేది స్నేహం… స్నేహంతో నిలబడ్డ జీవితాలెన్నో… కులం, మతం అనేది తెలియదు స్నేహానికి. తెలిసిందల్లా మంచిని పంచడం. తనని నమ్మిన వారిని విజయ తీరాలకు చేరుస్తుంది. విజయం విలువ తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం దోస్తులంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొనే పండుగే స్నేహితుల దినోత్సవం.
– ఖలీల్‌వాడి, ఆగస్టు 5
స్నేహితుల దినోత్సవాన్ని తొలిసారిగా యునైటెడ్ స్టేట్స్లో 1935లో జరిపారు. అమెరికాకు చెందిన జోసీ హాల్స్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి జరుపుకొన్నాడు. ప్రతి సంవత్సరం ఆగస్టులో సరదాగా నిర్వహించుకునే సంబురం కాస్త ఆయనకు వచ్చిన ఆలోచనతో ఫ్రెండ్‌షిప్‌డే గా మారింది. తన తోటి మిత్రులకు గ్రీటింగ్ కార్డులు అందజేసి ఆనందం పంచుకున్నాడు. అప్పటి నుంచి మన దేశంతో పాటు క్రమంగా ఇది ప్రపంచ దేశాలన్నింటికీ పాకింది. ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, గ్రీటింగ్‌లు పంచుకోవడం, సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలుపుకోవడం పరిపాటి అయ్యింది.
ఒకరికి ఒకరు
స్నేహం విలువ తెలిసినవారు ఒకరికి ఒకరు తోడుంటారనేది వాస్తవం. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు, ఇంట్లో వారితో పంచుకోలేమంటారు. కానీ మిత్రులతో పంచుకుంటాం. ఇద్దరిలో ఒకరికి బాధోస్తే ఇంకొకరు కన్నీరు కారుస్తారనడం అతిశయోక్తి కాదు. అలాంటి స్నేహం ఉన్నవారు లేకపోలేదు. ఏళ్లతరబడి స్నేహం చేస్తూ స్నేహం అనే పదానికి వన్నెతెచ్చే తత్వం వారిది.
పేద, ధనిక బేధం లేనిది
ధనిక, పేద చూడనిది.. కుల, మత భేదం లేనిది.. బంధుత్వం కన్నా గొప్పది.. స్నేహమొక్కటే. అనునిత్యం మనల్ని ప్రోత్సహిస్తూ, ఆనందాన్ని, దుఃఖాన్ని, విజయాలను, పరాజయాలను పంచుకొని సన్మార్గంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహితుల దినోత్సవం రోజు ఒకరికొకరు బహుమతులు, గ్రీటింగ్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మార్కెట్లో వివిధ రకాల గ్రీటింగ్ కార్డులు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు లభ్యమవుతున్నాయి. న్యూ ఇయర్, ఫ్రెండ్షిప్, వాలెంటైన్స్ డేకు గ్రీటింగ్స్ ఇచ్చి పుచ్చుకునేవారు. కాలం మారడంతో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడ నివాసం ఉన్నా.. స్నేహితులందరినీ ఒక్క దగ్గరికి చేరుస్తుంది.
స్నేహబంధాన్ని ఇలా దృఢం చేసుకోండి..
స్నేహితులను కలుపుతున్న సోషల్ మీడియా
ఉన్నత చదువులు, ఉద్యోగం, వ్యాపారం చేసే దశలో స్నేహితుల మధ్య దూరం పెరుగుతోంది. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా ఉండడంతో ఎప్పుడో తెరపడిన స్నేహం మళ్లీ కలుస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాతో దశాబ్దాల క్రితం బ్రేక్ పడిన స్నేహం మళ్లీ చిగురిస్తోంది. ఫ్రెండ్‌కు ఫ్రెండ్.. ఫ్రెండ్‌కు ఫ్రెండ్‌గా ఉన్న వారు ఎప్పుడో తమకు స్నేహితులని సోషల్ మీడియాలోని ఫేస్‌ను గుర్తుపడుతున్నారు. ఫేస్బుక్లో ప్రొఫైల్, ఫొటో, వివరాలు చూసి. ఒక్క రిక్వెస్ట్ కొడితే చాలు.. ఏనాడో విడిపోయిన ఫ్రెండ్ మళ్లీ దొరుకుతున్నాడు. పాత మిత్రులు ఒక్కటై స్నేహం కొనసాగుతోంది. వాట్సాప్‌లో గ్రూపులు ఏర్పాటు చేసుకొని తాము కలిసి ఉన్నప్పటి ఫొటోలు, వీడియో జ్ఞాపకాలు, తమ అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను షేర్ చేసుకుంటున్నారు.
పరిచయంతో మొదలై..
స్నేహం పరిచయంతో ప్రారంభమవుతుంది. పరిచయమైన ప్రతి వ్యక్తీ స్నేహితుడుగా మారలేడు. జీవనయాత్రలో ఎందరో మంది తారస పడుతుంటారు. విద్యార్థి దశ నుంచి ప్రారంభమై ఉద్యోగం, విశ్రాంతి దశలన్నింటా చాలా మంది కలుస్తుంటారు. వారిలో కొందరే స్నేహితులుగా మిగులుతారు. కొందరు బాల్య స్నేహితులైతే, మరికొందరు మధ్యలో కలిసిన వారు. కష్ట సుఖాల్లో తోడూనీడగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. ఆయా సందర్భాల్లో మిత్రులు స్పందించే తీరు, మనపై చూపే బాధ్యత స్నేహబంధాన్ని దృఢం చేస్తుంది. విశ్వసనీయత, నమ్మకం ఉన్న ఇద్దరు స్నేహితులుంటే జీవితంలో ఎలాంటి కష్టాలనైనా సులువుగా అధిగమించవచ్చు. మంచి స్నేహితులు మన అభ్యున్నతిని కోరుకుంటారు. ఎల్లవేళలా మనకు మంచే జరగాలని ఆకాంక్షిస్తారు. మన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అలాంటి స్నేహితుడిని ఒక్కడిని సంపాదించుకున్నా చాలు.. ఉన్నత శిఖరాలకు చేరుకోగలం.
స్నేహితుడు ఎలా ఉండాలి..
25 ఏండ్లుగా..
నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీలక్ష్మి దోస్తులు 25 ఏండ్లుగా తమ స్నేహాన్ని వీడలేదు. పెండ్లి చేసుకొని వివిధ ప్రాంతాల్లో సెటిలైనా.. మంచి, చెడులో ఒకరికొకడు అండగా ఉంటున్నారు. మిత్రులు ఫంక్షన్లు చేస్తే అందరూ అక్కడికి చేరుకొని కలిసిమెలిసి సంబురాలు చేసుకుంటారు. ఒకరికి ఆపద వస్తే అందరూ ఒక్కటై ఆదుకుంటున్నారు. ఇలా పద్మ, జయలక్ష్మి, గీతా, సుజాత, కవిత, కల్పన స్నేహబంధానికి వన్నె తెస్తున్నారు.
ప్రజలకు ‘స్నేహ’ హస్తం
నిజామాబాద్ నగరానికి చెందిన మంచాల జ్ఞానేందర్ మిత్రులు తమ అనుబంధాన్ని కొనసాగిస్తూనే ప్రజలకు స్నేహహస్తాన్ని అందిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభాగ్యులకు జ్ఞానేందర్ మిత్రులంతా అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.