నిజాంసాగర్, ఫిబ్రవరి 18: నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై పార్ట్‌టైం ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13న రాత్రి విధు లు నిర్వహించే పార్ట్‌టైం ఉపాధ్యాయుడు బి. రాజు విద్యార్థులంతా నిద్రపోయే సమయంలో 10గంటలకు వచ్చి కాళ్లు నొప్పులుగా ఉన్నాయని విద్యార్థితో కాళ్లు పట్టించుకున్నాడు. అనంతరం టాయిలెట్ వెళ్దామంటూ బాత్రూంలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థి ఈ విషయాన్ని మరుసటి రోజు ఉదయం ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌కు చెప్పడంతో అతనిని విధుల నుంచి తొలగించినట్లు ఆదివారం తెలిసిం ది. ఈ విషయమై ప్రిన్సిపాల్ హెన్రీని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా అందుబాటులో లేరు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు రాజును తొలగించామని, గతంలో కూడా అతనిపై ఆరోపణ వచ్చినట్లు తెలిపారు. విద్యార్థులతో ఉపాధ్యాయులు వెట్టిచాకిరి చేయిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మూడు నెలల క్రితం సైతం పార్ట్ టైం ఉపాధ్యాయుడు బి.రాజుపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని అప్పట్లో బయటికి రాకుండా ప్రిన్సిపాల్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మూడు నెలల్లో మరో ఘటన జరగడంతో విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుకునేందుకు భయపడుతున్నారు. ఇదేకాకుండా ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కొంతమంది రాత్రి సమయంలో మద్యం తాగి వస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.