మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అమ్మ ఒడి ‘102’ అంబులెన్స్ సేవలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఫోన్ చేసి సమాచారం అందిస్తే చాలు గర్భిణులను పరీక్షల నిమిత్తం దవాఖానలకు తీసుకెళ్లి పైసా ఖర్చు లేకుండా తిరిగి ఇండ్లకు చేరుస్తారు. ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి గర్భిణులకు వైద్యసేవలే కాకుండా రవాణా కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం దూరం చేసింది.
102 అమ్మఒడి సేవలను ఉపయోగించుకున్న గర్భిణులకు ప్రతినెలా ఏ తేదీకి వైద్యపరీక్షలు చేయించుకోవాలో ముందుగానే వారికి ఫోన్ మెస్సేజ్ ద్వారా గుర్తుచేస్తారు. శిశువు జన్మించిన 6 నెలల వరకు తల్లీబిడ్డలకు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురైనా, ఇమ్యునైజేషన్ టీకాల కోసం ఈ సేవలను వాడుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో 2018లో ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు మొత్తం 42,877 ట్రిప్పులకుగాను 92,570 మంది మహిళలకు లాభం చేకూరింది.
– నిజామాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఒకప్పుడు గ్రామాల్లో నిండు గర్భిణులు సైతం కాలినడకన అవస్థల మధ్య గ్రామంలోని బస్టాండు వద్దకు చేరుకునేవారు. అక్కడి నుంచి బస్సుల్లో, ఆటోల్లో ఇక్కట్లను ఎదుర్కొం టూ ప్రయాణం చేసి దవాఖానలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకునేవారు. గర్భస్థ సమయంలో, ప్రసవం అనంతరం అనేక మంది ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇక బస్టాండు వంటి సౌకర్యాలు లేని పల్లెల్లో ఎదురయ్యే సమస్యలు వర్ణనాతీతం. ఈ వ్యయ, ప్రయాసాలు అనుభవించిన వారికే తెలుస్తాయి. ఇలాంటి గడ్డు పరిస్థితిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టింది. 108 అత్యవసరాల సేవల మాదిరిగానే గర్భిణులు, బాలింతల కోసం 102 అంబులెన్సులను తీసుకువచ్చింది. ఫోన్ చేసి స మాచారం అందిస్తే చాలు… నేరుగా గర్భిణులు, బాలింతలను ఇంటి నుంచి దవాఖానలకు, తిరిగి స్వగ్రామానికి చేర్చే ప్రక్రియ మొదలైంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా నిజామాబాద్ జిల్లాలో మహిళల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నది. నూటికి 70 శాతం ఉన్న నిరుపేదల ఇబ్బందులను తొలగించడానికి సంకల్పించిన అమ్మఒడి 102 సేవలు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు ఓ వరంగా మారింది. అమ్మఒడి ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 42,877 ట్రిప్పులు ద్వారా 92,570 మంది బాలింతలు, గర్భిణులకు సేవలందాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడి పథకానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఈ సేవలు దరి చేరుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2018లో పథకం అందుబాటులోకి వచ్చింది. తొలి ఏడాది 2018 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 899 ట్రిప్పులకు 1628 మంది బాలింతలు, గర్భిణులకు మేలు జరిగింది. 2018-19లో 8,979 ట్రిప్పుల ద్వారా 17,862 మందికి, 2019-20లో 11,063 ట్రిప్పుల ద్వారా 24082 మందికి, 2020-21లో 11,860 ట్రిప్పులతో 22,918 మందికి, 2021-22లో ప్రస్తుతానికి 10,076 ట్రిప్పులకు 26,080 మందికి లబ్ధి జరిగింది. మొత్తం 42,877 ట్రిప్పులకు 92,570 మందికి లాభం చేకూరింది. గతంలో దవాఖానల్లో ప్రసవించిన అనంతరం ఇంటికి వెళ్లాలంటే ప్రత్యేక వాహనానికి రూ.వేలు ఖర్చు అయ్యేవి. ఇప్పుడు ఉచితంగానే అమ్మ ఒడి పథకంతో మహిళలకు గరిష్ట మేలు చేకూరుతున్నది. గర్భిణి మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు వివిధ రకాల వైద్య పరీక్షలకు 102 వాహనాల్లో ఉచిత సేవలు అందుతుండడం విశే షం. డెలివరీ అనంతరం శిశువుకు వివిధ దశల్లో టీకాలు ఇప్పించేందుకు 102 వాహనాలను వాడిన వారి సంఖ్య వేలల్లో చేరుతున్నది. గర్భిణులు వైద్య పరీక్షల కోసం అమ్మఒడిని సద్వినియోగం చేసుకోవాలంటే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది. తన పేరును ఆశ కార్యకర్త వద్ద నమోదు చేసుకుని 9నెలల వరకు ప్రతి నెలా యాంటినెంటల్ చెకప్(ఏఎంసీ) పరీక్షలకు ఇంటి నుంచి దవాఖానకు వెళ్లడానికి 102 సేవలను ఉపయోగించుకోవచ్చు. వైద్య పరీక్షల అనంతరం అదే వాహనంలో దవాఖాన నుంచి ఇంటికి భద్రంగా తీసుకెళ్తారు.
మాతా, శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత సేవలు అందుతున్నాయి. వైద్యశాలకు రావడానికి ప్రతికూలంగా మారిన రవాణా ఇబ్బందులను తీర్చడానికి 102 అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం 2016, డిసెంబర్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సత్ఫలితాలు రావడంతో కొద్ది రోజులకే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం విస్తరించింది. ఇప్పుడీ వాహనాలను ప్రవేశపెట్టడంతో నిజామాబాద్ జిల్లాలో సత్ఫలితాలు నమోదవుతున్నాయి. 102 ప్రత్యేక వాహనాల్లో ఐదుగురు గర్భిణులతో పాటు వారికి సహాయకులుగా మరో ఐదుగురు కూర్చునే వీలుంది. అల్ట్రా స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలకు రిఫర్ చేసిన గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సీహెచ్‌సీకి లేదా దగ్గరలోని ఏరియా వైద్యశాలకు తీసుకెళ్తారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి తీసుకొస్తారు. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా వైద్య పరీక్ష అవసరమని గుర్తిస్తే దవాఖానకు తీసుకెళ్లి వైద్య సేవలనంతరం ఇంటి వద్ద దించుతారు. క్ర మం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకున్న గ ర్భిణులకు ముందుగానే ప్రసవ తేదీని వైద్యులు ని ర్ణయిస్తారు. ఆ విషయాన్ని 102 వాహనం సిబ్బందికి, గర్భిణికి ముందుగానే సమాచారాన్ని అందిస్తారు.
పౌష్టికాహారం అందజేత, నిరంతర వైద్య పరీక్షలు, కేసీఆర్ కిట్లు, తాజాగా 102 అమ్మఒడి పథకం. ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు మరింత చేరువ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కేసీఆర్ కిట్ పథకానికి కొనసాగింపుగా అమలు చేస్తున్న అ మ్మఒడి పథకం గర్భిణులను ఆదుకుంటోంది. గ్రా మీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన దవాఖానలకు తరలించడం, ప్రసవానంతరం నవజాత శిశువుతో ఇంటికి సురక్షితంగా చేర్చడం వరకు మాతాశిశు సంరక్షణకు ఈ సేవలు దోహదం చేస్తున్నాయి. కాబోయే అమ్మలకు ఉచిత సేవలందించడానికి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 102 అమ్మఒడి వాహనాలపై రోజురోజుకూ విశ్వాసం పెరుగుతున్నది. గర్భిణులు వైద్య పరీక్షల కోసం అమ్మఒడిని సద్వినియోగం చేసుకోవాలంటే 102 నెంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి 102 అమ్మఒడి సేవలను ఉపయోగించుకున్న గర్భిణులకు ప్రతి నెలా ఏ తేదీకి వైద్య పరీక్షలు చేయించుకోవాలో ముందుగానే వారి ఫోన్‌కు మెస్సేజ్ ద్వా రా గుర్తు చేస్తారు. శిశువు జన్మించిన 6 నెలల వరకు మాతా శిశు సంరక్షణలో భాగంగా బాలింతలకు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురైనా, శిశువుకు ఇచ్చే ఇమ్యునైజేషన్ టీకాల కోసం కూడా ఈ సేవలను వాడుకోవచ్చు.
అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి రావడంతో మాతాశిశువులకు ఎంతో మేలు చేకూరుతోంది. అలాగే ఆరోగ్య పరీక్షల నిమిత్తం గర్భిణులకు ప్రతి నెలా దవాఖానలకు తరలిస్తుండడంతో వారి ప్రయాణ ఇబ్బందులు దూరం అయ్యాయి. 108 వాహనాలు సాంకేతికతను వినియోగించుకుని ఎలాంటి సేవలను అందిస్తున్నాయో అదే తరహాలో 102 వాహనాలు పనిచేస్తున్నాయి. అందుబాటులో ఉన్న యాప్, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గర్భిణుల వైద్య పరీక్షల తేదీ, ఒక రోజు ముందే పైలెట్లకు చేరుతుంది.
– నాగేంద్ర భూమ, ప్రోగ్రామ్ మేనేజర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా