ఏర్గట్ల,సెప్టెంబర్ 14: యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా.. ప్రమాదకరంగా వాహనాలను నడుపొద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జీవితం చాలా విలువైనదని, ఏమరుపాటుతో యువత దాన్ని పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ప్రాణాలపై నిర్లక్ష్యం వహించొద్దని, పోతే ప్రాణం తిరిగి రాదన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని నెరేళ్ల ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన సుమారు 750మంది యువతీ యువకులకు లర్నింగ్ లైసెన్స్ పత్రాలను మంత్రి వేముల గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ యువత కోసం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అందజేస్తున్నామన్నారు. లైసెన్సు లేకుండా యువత చాలా చోట్ల పోలీసు చెకింగ్‌లో దొరుకుతున్నారని, పోలీసులను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు తన దృష్టికి తెచ్చినట్లు గుర్తుచేశారు.
ఉచిత డ్రైవింగ్ లైసెన్సులకు 12వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేసి లైసెన్సులు అందించే టెక్నికల్ సదుపాయం లేదని అధికారులు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వేల్పూర్‌లో ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయించి, రాష్ట్ర వ్యాప్తంగా రెండు చోట్ల మాత్రమే ఉన్న రూటర్ టెక్నాలజీని తెచ్చి బాల్కొండ యువతకు వెనువెంటనే లర్నింగ్ లైసెన్సులు అందజేస్తున్నామని అన్నారు. గతంలో నెలలు, ఏండ్ల తరబడి లైసెన్సుల కోసం తిరిగేవారని, కానీ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న మూడో రోజే లర్నింగ్ లైసెన్సు అందుతున్నదన్నారు. దీని వెనుక ఎంతో కష్టం, శ్రమ దాగి ఉన్నదని వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, ఉచిత డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చినట్లే యువత శ్రేయస్సు దృష్ట్యా ఉచితంగా హెల్మెట్లు కూడా ఇస్తానని మంత్రి వేముల ప్రకటించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీఏ కమిషనర్ వెంకటరమణ, నాయకులు కోటపాటి నర్సింహానాయుడు, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం, నాయకులు సున్నపు అంజయ్య, బద్దం శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు బర్మ చిన్న నర్సయ్య, పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ జక్కాని మధుసూదన్, మండల కోఆప్షన్ మెంబర్ అశ్రఫ్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
చాలా మంచి పనిచేశారు..
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించేందుకు చాలా మంచి పని చేస్తున్నారు. మేము ఇంతకు మునుపు డ్రైవింగ్ లైసెన్స్ కోసం పోతే ఏమీ అర్థం గాక వదిలేశాం. కానీ కొద్దిరోజుల్లోనే లర్నింగ్ లైసెన్స్ ఇప్పించి మా కుటుంబాలకు రక్షణ కల్పించారు. మంత్రికి రుణపడి ఉంటాం.
– కొత్తపల్లి లక్ష్మి,బట్టాపూర్, ఏర్గట్ల మండలం
చాలాసార్లు ఫైన్లు కట్టిన..
నేను కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న. విధులు ముగించుకొని ఇంటికి వచ్చే సమ యంలో పోలీసులు ఆపి లైసెన్స్ పత్రాలు అడిగే వారు. లైసెన్స్ పత్రాలు లేక నేను ఫైన్ కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో నాకు కొన్ని రోజుల్లోనే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. మంత్రికి రుణపడి ఉంటాం.
– బి.దామోదర్, ఏర్గట్ల