అకాల వర్షం ఉమ్మడి జిల్లాను ఆగం చేసింది. సోమ, మంగళవారాల్లో కురిసిన వడగండ్ల వాన అపార నష్టం మిగిల్చింది. వరిపైర్లు నేలకొరిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వాననీటితో కొట్టుకుపోయింది. బలమైన ఈదురుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రేకులు మీదపడి నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఓ మహిళ దుర్మరణం చెందింది.
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి పైర్లు నేలవాలాయి. వడ గండ్లతో వడ్లు, మామిడి కాయలు రాలిపోయాయి. కోసి ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. ఈదురు గాలులకు పలుచోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో రాకపోకలు స్తంభించగా.. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. యాసంగి పంటలు కోత దశలో ఉన్న సమయంలో ఈదురు గాలులు, వడగండ్లు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. కల్లాల వద్ద ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో కంటతడి పెడుతున్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో వర్షం ధాటికి ఇంటిపై రేకులు మీదపడి ఓ మహిళ మృతిచెందింది.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 25