ఖలీల్‌వాడి, మార్చి 17 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం రెండు వేర్వేరు బిల్లులను పెట్టిందని జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి స్పష్టం చేశారు. బీసీల కోసం కవిత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తెలంగాణ జాగృతి సాధించిన మరో భారీ విజయంగా అభివర్ణించారు.
అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలంగా దేశంలో అన్ని రకాల అన్యాయాలకు గురైన బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టడాన్ని స్వాగతి స్తున్నామని తెలిపారు.
విద్యా, ఉపాధి రాజకీయ రిజర్వేషన్లకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని ముందే గుర్తించి వేర్వేరు బిల్లులు పెట్టాల్సిందేనని డిమాండ్ చేసింది కేవలం జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రమేనని గుర్తు చేశారు. మండల్ కమిషన్ రిపోర్టును తొక్కి పెట్టింది మొదలు కులగణను డెడికేటెడ్ కమిషన్ కాకుండా రెగ్యులర్ కమిషన్‌కు ఇచ్చే వరకు కాంగ్రెస్‌ది ద్రోహచరిత్ర అని పేర్కొన్నారు. సమావేశంలో ఈగ సంతోష్, అర్చన, సేనాపతి, కిశోర్‌యాదవ్, లింగం, ఆనంద్, లలిత యాదవ్, లావణ్య, రాజు, తేజ, సందీప్, వికాస్ పాల్గొన్నారు.