కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 22:తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలు పూలసింగిడిని తలపించాయి. మహిళలు ఆడిపాడగా.. పల్లెలు, పట్టణాలు మార్మోగాయి. కామారెడ్డి జిల్లాలో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకాయి. గౌరమ్మను గంగమ్మ చెంతకు చేర్చిన మహిళలు వచ్చే ఏడాది మళ్లీ రావాలంటూ కోరుకున్నారు. వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. కలవారి కోడలు ఉయ్యాలో.. గౌరమ్మగౌరమ్మ ఉయ్యాలో అంటూ ఊరూవాడా మార్మోగింది. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గౌరమ్మ ఆదివారం గంగమ్మ ఒడికి చేరింది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. పల్లెలన్నీ పూలవనాన్ని తలపించాయి. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలు పాడారు. యువతులు, పిల్లలు దాండియా, కోలాటాలు ఆడారు. అనంతరం శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. మహిళలు వెంట తెచ్చుకున్న సద్దులను ఆరగించారు.