శక్కర్‌నగర్, నవంబర్ 15 : బోధన్ పట్టణంలో ఓ చిన్నారి అపహరణ.. విక్రయం కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ కె.ఎం.కిరణ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. మేకల లక్ష్మి అనే మహిళ నిజామాబాద్ రూరల్ మండలంలోని కొత్తపేట్‌లో తన భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా బోధన్ మండలంలోని చిన్నమావంది గ్రామంలో తన పదినెలల కూతురితో కలిసి ఉంటున్నది. కాగా ఈ నెల 7న కూతురు అనారోగ్యానికి గురికావడంతో బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో చేర్పించింది.
ఈ నెల 9న ఆరోగ్యం కుదుట పడడంతో డిశ్చార్జి చేశారు. లక్ష్మి తన కూతురితో ఆ రోజు రాత్రి సమీపంలోని ఓ మసీదు ఆవరణలో నిద్రించింది. 10వ తేదీ తెల్లవారు జామున లేచి చూసే సరికి చిన్నారి కనిపించకపోవడంతో ఆమె ముందుగా తన భర్తను అనుమానించింది. అక్కడ కూతురు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 12న ఉదయం బోధన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బోధన్ పట్టణ సీఐ బీడీ ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి విచారణ ప్రారంభించారు. చిన్నారిని బోధన్‌కు చెందిన గంగామణి అపహరించి, అంజలికి అప్పగించింది. అనంతరం షమీమ్‌బేగం మధ్యవర్తిగా వ్యవహరిస్తూ సంతానం లేని హైదరాబాద్‌కు చెందిన పర్వీన్ బేగం పాపను రూ.30 వేలకు విక్రయించింది. పట్టణ సీఐ బీడీ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై నవీన్, సిబ్బంది కలిసి ఆధారాలు సేకరించగా ఓ ప్రాంతంలో మహిళలు డబ్బులు పంచుకున్నట్లు అందిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపారు. ఈ సంఘటనలో బాలిక కిడ్నాప్‌నకు ప్లాన్ చేసిన గంగామణి, ఇందుకు సహకరించిన అంజలి, విక్రయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన షమీమ్ బేగంతో పాటు బాలికను కొనుగోలు చేసిన పర్వీన్‌పై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపుతున్నట్లు బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్సై నవీన్, పీసీలు శ్రీకాంత్, రవి, జావీద్‌ను ఏసీపీ అభినందించారు. సమావేశంలో బోధన్ పట్టణ, రూరల్ సీఐలు బీడీ ప్రేమ్ కుమార్, జి. శ్రీనివాస రాజు ఉన్నారు.