కామారెడ్డి రూరల్, ఆగస్టు 20: నంబర్ ప్లేట్లు మార్చి, నకిలీ ఆర్సీలు సృష్టించి, ఆన్లైన్లో కార్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కార్లు, ఫోర్జరీ చేసిన ఆర్సీలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మాచారెడ్డికి చెంది న ఓ వ్యక్తి ఫేస్బుక్ అప్లికేషన్ ద్వారా కారు కొనుగోలు చేశాడు. రెండు రోజుల అనంతరం కొందరు వ్యక్తులు ఈ కారు మాది.. మీరు ఎలా కొన్నారని బెదిరిం చి, కారును తీసుకెళ్లారు.
ఈ విషయమై బాధితుడు జూలై ఒకటో తేదీన మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు బాధ్యులైనవారు శేర్లింగంపల్లిలో ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు ముఠాగా ఏర్పడిన సభ్యులు.. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు కారు తీసుకుంటారు. దానికి ఫేక్ నంబర్ ప్లేట్, ఆర్సీ తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తారు. అనంతరం అది తమ కారు అని, మీరు ఎలా కొ న్నారంటూ బెదిరించి కారును తీసుకెళ్తారు.
పది రోజులుగా శేర్లింగంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో తలదాచుకున్న ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేయగా.. ఒకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి ఇన్నోవా, ఎర్టి గా, బెలెనో కార్లు, 15మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పది మైక్రో సిమ్ కార్డులు, ఖాళీ చిప్‌లు, ఫోర్జరీ చేసిన ఆర్సీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, కానిస్టేబుళ్లు సుభాష్‌రెడ్డి, సిద్ధిరాములు, శ్రీకాంత్, ఐటీ సెల్ హెచ్‌సీ శ్రీనివాస్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.