ధర్పల్లి/ సిరికొండ, ఏప్రిల్ 18: బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపన చేస్తుండడం రూరల్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇందల్వా యి మండలంలో రెండు బ్రిడ్జిలు, ధర్పల్లి మండలంలోని వాడి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిధులు మంజూరుచేసి పనులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత ఎమ్మెల్యే భూపతిరెడ్డి మళ్లీ శిలాఫలకాలు వేసి పనులు చేపట్టడంపై ప్రజలు అవాక్కవుతున్నారు.
సిరికొండ మండలం చీమన్‌పల్లిలో పీహెచ్సీ నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ హయాంలోనే నిర్ణయించారు. పీహెచ్సీ నిర్మాణానికి అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా శుక్రవారం చీమన్‌పల్లిలో పీహెచ్సీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి మళ్లీ శంకుస్థాపన చేయడం గమనార్హం. అయితే, గతంలో కేటాయించిన స్థలంలో కాకుండా మరోచోట పీహెచ్సీ ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశమైంది. పాత పనులకే మళ్లీ శిలాఫలకాలు వేస్తూ ప్రజలను మోసం చేయకుండా నిధులు తీసుకువచ్చి కొత్తగా అభివృద్ధి పనులు చేపడితే తాము స్వాగతిస్తామని మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పేర్కొన్నారు.