ఖలీల్‌వాడి, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాటే కేసీఆర్ బాట అని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. అందుకే సచివాలయానికి ఆయన పేరు పెట్టారని, దేశంలోని 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. అదే అంబేద్కర్ సమసమాజ స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీకి నచ్చదని, అసలు ఆయన రాసిన రాజ్యాంగాన్నే బీజేపీ మెచ్చదని విమర్శించారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ జీవన్‌రెడ్డి సోమవారం ప్రకటన జారీ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నేతలు ఆధిపత్య దురహంకారులు అని, బడుగు, బలహీనవర్గాల వారిని సహించలేరని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని తన అవినీతి, అక్రమాలు, అవకాశవాద విధానాలకు అనుగుణంగా కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా సవరణలు చేసి అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిందన్నారు.
రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ ధోరణులు ఉన్నాయని, ఆ పార్టీ ఎజెండాకు అనుగుణంగా మరో రాజ్యాంగాన్ని తెరపైకి తెచ్చే దుష్ట తలంపుతో ఉందని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్ తీర్మానం చేస్తే సరిపోతుందన్న అంబేద్కర్ మాటే తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసిందని జీవన్‌రెడ్డి తెలిపారు. అంబేద్కర్ స్పూర్తితో ఏర్పాటైన తెలంగాణలో ఆ మహానీయుడి ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ పదేండ్ల పాలన సాగిందన్నారు.
అంబేద్కర్ మాటే తన బాటగా, ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ స్పూర్తికి కట్టుబడి పాలన సాగేలా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ సెక్రటేరియట్‌కు ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. దళితుల్లో పేదరికాన్ని నిర్మూలించడం కోసమే కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కానీ దళితబంధును రద్దుచేసిన రాక్షస పాలన కాంగ్రెస్‌దని మండిపడ్డారు. అంబేద్కర్‌ను అవమానించేలా రేవంత్‌రెడ్డి పెత్తందారీ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. అధికారం ఉన్నా, లేకపోయినా బీఆర్ఎస్ అంబేద్కర్ బాట వీడదని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తూనే ఉంటుందని జీవన్‌రెడ్డి తెలిపారు.