ఖలీల్‌వాడి, నవంబర్ 21: ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు అని, కేటీఆర్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ఎప్పటికీ కడిగిన ముత్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ‘ఫార్మూలా ఈ రేస్’ అనే అభూత కల్పిత సీరియల్‌ను సృష్టించి, దానిని సాగదీస్తూ బీఆర్ఎస్ను దెబ్బ కొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో పాత్రధారులు, సూత్రధారులు రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సీఎం రమేశ్ అని పేర్కొన్నారు.
కేటీఆర్‌పై కేసు రేవంత్‌రెడ్డి ప్రెస్టేషన్‌కు నిదర్శనమని, పాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలతో రేవంత్ నానా తంటాలు పడుతున్నాడన్నారు. కేటీఆర్‌పై కేసుకు తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో రాజకీయ తతంగం చేశారని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదించడానికి మనసు రాని గవర్నర్.. బీజేపీ పెద్దల ఆదేశాలు పాటిస్తూ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే కేసులకు మాత్రం ఆగమేఘాల మీద అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌పై కేసు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధం మరోమారు బయటపడిందని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో కేటీఆర్‌ను మిస్టర్ క్లీన్‌గా అభివర్ణించారు. కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసింగ్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి చేర్చాడన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాదిరిగా తన సోదరులు, బావమరుదులకు దోచిపెట్టలేదని, రేవంత్‌లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి పట్టుబడిన నేర చరిత్ర కేటీఆర్‌కు లేదన్నారు. కేటీఆర్‌పై అవినీతి పరుడనే ముద్ర వేసి రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్స్, కాంగ్రెస్ అంటేనే చీటర్స్ అని తెలిపారు. బీఆర్ఎస్ది 60 లక్షల గులాబీ సైన్యం అని, ఉద్యమకాలంలో పెద్దబాబులనే తరిమికొట్టామని, ఈ చిన్నబాబులు తమకొక లెక్కా? అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి రాక్షసానందం పొందడానికి కేసీఆర్ ఫ్యామిలీతో గోక్కున్నావు, వైఎస్సార్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ర్టానికి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని, ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో గెలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. కాంగ్రెస్ 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని, సర్కార్ దాష్టికాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రతిపక్షంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పని చేస్తున్నారని, ఇది రేవంత్ పగకు కారణమన్నారు. ఒక్కరోజైనా కేటీఆర్‌ను జైల్లో పెట్టి మానసికానందం పొందాలని రేవంత్ తాపత్రయ పడుతున్నాడని పేర్కొన్నారు. కేటీఆర్ జీడీపీ పెంచితే.. రేవంత్ గుండాయిజం పెంచారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తలసరి ఆదాయం పెంచగా.. రేవంత్ తన సొంత ఆదాయం పెంచుకున్నాడన్నారు. ఫార్మూలా వన్‌లో కేటీఆర్ జైలుకు పోతే ఎందరో సీఎంలు జైలుకు పోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఫార్ములా వన్‌తో కేటీఆర్ పెట్టుబడులు తెస్తే రేవంత్‌రెడ్డి అందాల పోటీలతో రాష్ట్రం పరువును అంగట్లో పెట్టి అమ్మారని, లోకేశ్ ఏపీకి ఇప్పుడు గూగుల్ తెస్తే.. కేటీఆర్ హైదరాబాద్‌కు ఎప్పుడో తెచ్చారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.