మోర్తాడ్, మే 22: హైడ్రా కూల్చివేతలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమ నిర్మాణాలను హైడ్రా పేరుతో కూల్చివేయడం న్యాయమే అనుకుంటే ముందుస్తు నోటీసులు, కనీస సమయం ఇవ్వకుండా పేదలవి మాత్రమే ఎందుకు కూల్చుతున్నారని, వారు చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చాలా ఏండ్ల నుంచి పేదలు అక్కడ నివసిస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా పేదలపై కనికరం లేకుండా అరాచకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదోడు అంటే అంత చులకనా అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి లాంటి పెద్దలకు మాత్రం సమయం ఇస్తూ వాళ్ల అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కమీషన్లు ఇవ్వండి లేదంటే మీ ఇంటిపైకి హైడ్రాను పంపిస్తామని బెదిరిస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు.
చట్టం ఎవరికీ చుట్టం కాదని, మాది ప్రజాపాలన అంటూ మైకుల ముందు ఊదరగొట్టే రేవంత్‌రెడ్డి హైడ్రా విషయంలో కూడా చట్టం అందరికీ సమానంగా వర్తింపజేయాలని తెలియదా? అని ప్రశ్నించారు. హైడ్రా విషయంలో కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా తీరు మారకపోవడం, గతంలో అనేక సార్లు కోర్టు తీర్పులను తప్పుబడుతూ రేవంత్‌రెడ్డి బహిరంగంగా మాట్లాడిన తీరు ఆయనకు చట్టాలపై ఎటువంటి గౌరవం లేదన్న విషయం స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.
అధికార బలాన్ని ఉపయోగించి పేదవాడి ఇల్లు కూల్చడం రేవంత్‌రెడ్డికి గంట పని కావచ్చు, కానీ ఇల్లు కట్టుకోవడం అన్నది పేదోడి జీవితకాల కష్టం, వారి గోల్ అన్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. రాచరిక పోకడలతో నేనే రాజు నేనే మంత్రి అన్న ట్లు పేద ప్రజలతో చెలగాటమాడుతున్న రేవంత్‌పై ప్రజలు తిరగబడే రోజు తొందరలోనే వస్తుందన్నారు. పేదోడి ఇల్లు కూలగొట్టి .. దాన్ని బూచీగా చూపి పెద్దవాడిని భయపెట్టి, కమీషన్లు రా బట్టి.. ఢిల్లీకి మూటలు పంపు అన్న చందంగా రేవంత్ పాలన ఉన్నదని మండిపడ్డారు.
రేవంత్ రాజకీయకోటలు కూలగొట్టడం ఖాయం
కేసీఆర్‌ను కాకుండా రేవంత్‌రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నామని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలాగే వ్యవహరిస్తే నీ రాజకీయ కోటలు ఇదే ప్రజలు కూలగొట్టడం ఖాయమని హెచ్చరించారు. కాళేశ్వరం పై సుప్రీంకోర్టు వ్యాఖ్యతో కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీస్‌లు ఇవ్వడం కేవలం ఆయనను వేధించడానికే అనే విషయం స్పష్టమైందన్నారు.
కేసీఆర్‌ను ఎదుర్కోలేకే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని అందుకే రేవంత్‌రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు కేంద్రం వంతపాడుతున్నదని ఆరోపించారు. కాళేశ్వరం తెలంగాణ కరువును పారద్రోలే ఒక్క బృహత్తర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని సీడబ్ల్యూసీ బృందం, దాని చీఫ్ ఇంజినీర్ సీకేఎల్ దాస్, అప్పటి గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, సాగునీటి రంగనిపుణులు కాళేశ్వరం గొప్పతనం గురించి చెప్పిన మాటలు రేవంత్, బీజేపీకి విన బడకపోవడం శోచనీయమన్నారు.