బోధన్, ఏప్రిల్ 10: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మాతృమూర్తి షగుఫ్త ఆదిబ్ (78) అంత్యక్రియలు గురువారం సాయంత్రం బోధన్‌లో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆదిబ్ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు అయిన షగుఫ్త ఆదిబ్ 2005లో ఉద్యోగ విరమణ చేశారు.
ఆమెకు బోధన్ పట్టణంలో మంచి పేరుంది. దుబాయ్‌లో ఉంటున్న షకీల్ తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన బయలుదేరి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి ఆయనను రిసీవ్ చేసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి షకీల్ నేరుగా బోధన్‌కు చేరుకోగా, అప్పటికే ఆయన మాతృమూర్తి పార్థివదేహాన్ని ఇంటికి తరలించారు. తల్లి మృతదేహాన్ని చూసి ఆయన దుఃఖాన్ని ఆపుకోలేక పోయారు. తల్లి నుదుటిని ముద్దాడుతూ చిన్న పిల్లాడిలా విలపించారు.
పరామర్శించిన జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి షగుఫ్త ఆదిబ్ అంత్యక్రియలు గురువారం సాయంత్రం బోధన్‌లో నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. షకీల్‌తో కలిసి జీవన్‌రెడ్డి పాడె మోశారు. అంతకుముందు షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా, సోదరుడు సోహెల్‌ను వారు పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలు గోగినేని నర్సయ్య, సంజీవ్‌కుమార్, డి.శ్రీరామ్, నర్సింగ్‌రావు, భూమారెడ్డి, రవీందర్ యాదవ్, పి.రవికిరణ్, గిర్దావర్ గంగారెడ్డి, రజితా యాదవ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.