ఎత్తయిన కొండలు.. కనుచూపు మేర అడవులు.. ప్రకృతితో మమేకమైన బతుకులు.. తరతరాలుగా గౌరారం గ్రామస్తులకు అడవితో అనుబంధం కొనసాగుతున్నది. ఊరు చుట్టూ ఉన్న అడవి ఆ పల్లెబిడ్డలను కన్న తల్లిలా ఆదరిస్తున్నది. కానీ, కొందరి స్వార్థం పచ్చని అడవికి ముప్పుగా మారింది. చెట్లను నరుకుతూ, అటవీ భూములను ఆక్రమించడం గ్రామస్తులను కదిలించింది. దశాబ్దాలుగా ఆధారపడి బతుకుతున్న అడవులను రంక్షించుకునేందుకు ఊరు ఊరంతా ఏకమైంది. కబ్జాకు గురైన భూముల్లో సాగు చేస్తున్న పంటల్లోకి పశువులను వదలడమే కాకుండా గుడిసెలను ధ్వంసం చేశారు. ప్రకృతిని పరిరక్షించేందుకు ఫారెస్టు సిబ్బందితో కలిసి నడుం బిగించిన ఆ గ్రామస్తులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
-గాంధారి, ఆగస్టు 31
తరతరాలుగా పచ్చటి అడవితో మమేకమై బతుకుతున్నారు గౌరారం గ్రామస్తులు. ఊరు చుట్టూ ఉన్న ఎత్తయిన గుట్టలు, పచ్చని చెట్లు.. ప్రకృతి అందాలన్నీ గౌరారం చుట్టుపక్కలే ఉన్నట్లు అనిపిస్తుంటుంది. టేకు, మర్రి, ఇప్ప, తెల్లబిట్ల, సిరుమని, మద్ది వంటి అరుదైన చెట్లతో పాటు మామిడి, మొర్రి, తునికి, జీడి, అల్లనేరేడు, సీతాఫలం వంటి అనేక రకాల పండ్ల చెట్లు ఇక్కడి అడవుల్లో ఉన్నాయి. కాలానుగుణంగా లభించే పండ్లు, కాయలతో పాటు ఇప్ప పువ్వు, తునికాకును సేకరించి ఎండబెట్టి విక్రయించి పొట్ట పోసుకునే వారు. అలాగే, చు ట్టూ అడవి ఉండడంతో పశు సంపదను నమ్ముకున్నారు. మేత కోసం అడవులకు వెళ్లే వారు.
గ్రామస్తులు ఎన్నో విధాలుగా ఆధారపడిన అడవి.. కొందరి స్వార్థం వల్ల మెల్లిగా కనుమరుగు కావడం మొదలైంది. చుట్టుపక్కల తండాలు, గ్రామాలకు చెందిన కొందరు అత్యాశకు పోయి పెద్దపెద్ద చెట్లను నరుకుతూ, ట్రాక్టర్లతో చదును చేసి పంటలు సాగు చేయడం ప్రారంభమైంది. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడం, అటవీ ఉత్పత్తులు నమ్ముకుని బతుకుతున్న వారికి జీవనాధారం కొరవడడంతో గౌరారం గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు, పశువులకు మేత కూడా కరువైన పరిస్థితి ఏర్పడింది. అడవులు తగ్గిపోతుండడంతో అటవీ జంతువులు ఊరిలోకి వస్తున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన గౌరారం గ్రామస్తులు.. ఆయా సమస్యలన్నింటికీ మూలం అడవులు తగ్గడమేనని గుర్తించారు. తల్లి లాంటి అడవిని తిరిగి కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఊరంతా ఏకమయ్యారు.
రోజురోజుకు అటవీ భూములు ఆక్రమణలకు గురై, చెట్లు కనుమరుగై పోతుంటే తట్టుకోలేక పోయిన గ్రామస్తులు.. అటవీ భూముల రక్షణకు నడుం బిగించారు. ఇటీవలే స్థానిక ఆంజనేయుని ఆలయ ఆవరణలో ఫారెస్టు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే అటవీ భూముల రక్షణకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ శివారులోని అటవీ భూమిని సర్వే జరిపించి అటవీ హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను కోరాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అడవి భూముల్లో వేసిన గుడిసెలను తొలగించారు. అటవీ భూములను కబ్జా చేసి సాగు చేస్తున్న పంటల్లోకి పశువులను వదిలారు.
తరతరాలుగా గ్రామ ప్ర జలందరం అడవి తల్లిని నమ్ముకుని బతుకుతు న్నాం. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కన్నతల్లి లాంటి అడవిని నరికి వేస్తున్నారు. అడవి భూ ముల విస్తీర్ణం తగ్గడంతో చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకే గ్రామస్తులమంతా ఏకమై అటవీ భూములను రక్షించాలని నిర్ణయించాం. ఫారెస్టు అధికారులు అటవీ భూములను గుర్తించి హద్దులను ఏర్పాటు చేయాలి.
– వంజరి శంకర్, గౌరారం గ్రామస్తుడు
భావి తరాలను దృష్టిలో ఉంచుకొని అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. అడవులు అంతరించి పోతే ప్రకృతి సమతౌల్యం దెబ్బ తింటుం ది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితి రావొద్దంటే అడవులను కాపాడుకోవాలి. మా గౌరారం నుంచి మొదటి అడుగు పడడం ఆనందంగా ఉంది. మిగతా ఊర్లు కూడా ఇలాగే ముందుకు రావాలి.
– మనోహర్రావు, మాజీ సర్పంచ్, గౌరారం
అటవీ భూముల సంరక్షణకు ముందుకొచ్చిన గౌరారం గ్రామస్తులు అభినందనీయులు. వారిని మిగతా గ్రామాల వారు ఆదర్శంగా తీసుకోవాలి. గ్రామ శివారులోని అడవి భూమి రక్షణ కోసం గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేయడం సంతోషంగా ఉంది. మిగతా గ్రామాల ప్రజలు సైతం అడవుల సంరక్షణకు నడుం బిగించాలి.
– హిమచందన, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, గాంధారి