కామారెడ్డి, జూన్ 10: రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు బ్యాగులు పట్టుకొని బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సుల సామర్థ్యంపై అనుమానాలు వస్తున్నాయి. మోటారు వాహనాల చట్టం నిబంధనల మేరకు ప్రతి సంవత్సరం బస్సుల సామర్థ్య(ఫిట్నెస్) పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలకు ఇవేమీ పట్టనట్లు కనిపిస్తున్నది. అందుకు సామర్థ్య పరీక్షలకు వచ్చిన బస్సుల సంఖ్యనే నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 232 ప్రైవేటు స్కూల్ బస్సులు ఉన్నాయి. కానీ ఫిట్నెస్ పరీక్షలకు మాత్రం ఇప్పటి వరకు 101 బస్సులు మాత్రమే రావడం గమనార్హం. మిగతా బస్సులు ఎక్కడున్నాయి… అవన్నీ ఫిట్‌గానే ఉన్నాయా? ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై నడిపితే ప్రమాదాలకు ఆస్కారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపై నడిస్తే పట్టుకొని సీజ్‌చేస్తామని జిల్లా రవాణాశాఖ అధికారి హెచ్చరిస్తున్నారు.
సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవే..
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రవాణాశాఖ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఒక బస్సు రోడ్డు ఎక్కాలంటే తప్పనిసరిగా 32 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఫిట్నెస్, టైర్లు, సాంకేతిక సామర్ధ్యం తదితర ఆంశాలపై సంతృప్తి చెందితెనే సర్టిఫికేట్ జారీ చేస్తారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం..
ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్సులను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. తనిఖీల్లో పట్టుబడితే బస్సులను సీజ్ చేస్తాం. 15ఏండ్లు దాటిన స్కూల్‌బస్సులను నడుపొద్దు. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే ఆటోలు, ఇతర వాహనాలపైనా నిఘా పెడుతాం. స్కూల్ పిల్లలను జాగ్రత్తగా ఇంటికి, పాఠశాలకు తీసుకెళ్లే వారినే యాజమాన్యాలు బస్సు డ్రైవర్‌గా నియమించుకోవాలి. డ్రైవర్, అటెండర్ ఎలాంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేవించకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలదే.
– శ్రీనివాస్‌రెడ్డి,జిల్లా రవాణాశాఖాధికారి, కామారెడ్డి