Nizamabad | కంటేశ్వర్ ఏప్రిల్ 14 : జిల్లా కేంద్రంలో డంపింగ్ యార్డ్ పై స్థానిక ప్రజల సమరం కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి డంపింగ్ యార్డ్ లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల వల్ల వెలువడుతున్న పొగ దుర్వాసన కారణంగా నాగారం, 300 క్వార్టర్ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై గత వారంలో స్థానికులు చెత్త వాహనాలను ఆపి ధర్నా చేయగా మున్సిపల్ కమిషనర్ స్థానిక ప్రజలను సముదాయించి ప్రమాదాలు జరగకుండా ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పడంతో ప్రజలు తమ ధర్నా విరమించి వాహనాలు అనుమతించారు.
ఆదివారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ఎప్పటిలాగే డంపింగ్ యార్డ్ నుంచి భారీ మొత్తంలో దుర్వాసనతో పొగ వెలవడంతో స్థానిక 300 క్వార్టర్స్ ప్రజలు తీవ్ర అనారోగ్యం గురై దాదాపు 10 నుండి 15 మంది ఆసుపత్రి పాలవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమను పట్టించుకోరని స్థానికులు ఆగ్రహంతో రాత్రి నుంచే రోడ్డుపై చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులకు మద్దతుగా సీపీఎం నాయకురాలు సుజాత అక్కడికి వెళ్లి మధ్య రాత్రి ఒంటిగంట వరకు ప్రజలతోటి ఉండి నిరసన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న పోవు కారణంగా కారణంగా వృద్ధులు పిల్లలు శ్వాస ఇబ్బందులు ఎదుర్కొని ఇంట్లో ఉండక రాత్రంతా రోడ్లపై తిరిగిన పరిస్థిత ఏర్పడదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకురాలు సుజాత మాట్లాడుతూ పోయిన ఆదివారం కమిషనర్ వచ్చి 15 రోజుల్లో ఈ పొగ సమస్య నుంచి మీరు బయట పడే విధంగా తమ వంతుగా ప్రయత్నం చేస్తామని, మీకు రక్షణ కల్పిస్తారు అని చెప్పారని, కానీ ఈ ఆదివారం విఫరీతమైన మంటలు చెలరేగి పొగ రావడంతో అక్కడ ప్రజలు ఆస్పత్రి పాలు అవుతున్నారని వాపోయారు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని, అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరారు, లేకుంటే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ని స్థానికులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతం నుండి డంపింగ్ యార్డ్ కు చెత్త వాహనాలు అనుమతించకపోవడంతో సోమవారం ఉదయం డంపింగ్ యార్డ్ ఖాళీ చేయడానికి వెళ్లిన చెత్త వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఏమి చేయలేక అదే చెత్తను తీసుకొని తిరిగి పార్కింగ్ యాడ్ కు చేరుకోవడం విశేషం. ఇప్పటికే నగరంలో పలు డివిజన్లో చెత్త సేకరణ దినం తప్పి దినం జరుగుతోంది. అయితే దానికి తోడు డంపింగ్ యార్డ్ కు చెత్త వాహనాలు అనుమతించకపోవడంతో వాహనాలన్నీ ఎక్కడండి పార్కింగ్ యాడ్లో నిలిచిపోవడంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.