భీమ్గల్, నవంబర్ 3 : జిల్లాలో వీధి కుక్కల దాడుల కేసులు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా భీమ్గల్ మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిపై వీధికుక్కలు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పాఠశాలలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా వీధికుక్కలు ఒకేసారి దాడి చేశాయి. దీంతో పొత్తి కడుపు, కాళ్లకు గాయాలయ్యాయి.
వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు వెళ్లి చికిత్స తీసుకున్నారు. పట్టణంలో కుక్కల బెడద తీవ్రతపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కస్తూర్బా పాఠశాల పక్కనే ఉన్న డంపింగ్ యార్డు, చికెన్ వ్యర్థాలు పడేయడంతో కుక్కలు అక్కడ గుంపులుగా చేరి అటుగా వెళ్తున్నవారిపై దాడులు చేస్తున్నాయని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.