నిజాంసాగర్, జూన్12: విహారయాత్రకు వెళ్తున్నామని సంబురపడిన ఆ చిన్నారులు తండ్రితోపాటు విగతాజీవులుగా మారారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తోసేసి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ హృదయవిదారకమైన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. బాన్సువాడ సీఐ తిరుపయ్య, నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయి కృష్ణ(34), తన భార్య బోయి సవిత, వారి కుమారుడు రక్షిత్(9), కూతురు అనన్య(5) తో కలిసి పటాన్చెరువు సమీపంలోని రాంచంద్రపురం ప్రాంతంలో మూడు నెలలుగా నివాసం ఉంటున్నారు.
మొన్నటి వరకు నిజాంపేటలో ఉంటున్న వీరి ఇల్లు కూలిపోవడంతో అద్దెకు తీసుకున్న ఇంట్లో సామగ్రిని ఉంచి బతుకుదెరువు కోసం వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, భార్య సవిత ఓ టిఫిన్ సెంటర్లో పనిచేస్తూ బతుకీడుస్తున్నారు. ప్రతిరోజూ భార్యభర్త మధ్య గొడవ చోటుచేసుకునేది. గురువారం ఉదయం కృష్ట తన ఇద్దరు పిల్లలను బయటికి తీసుకువెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. పిల్లలకు మాత్రం టూర్‌కు వెళ్తున్నామని చెప్పి వారిని నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు తీసుకువచ్చాడు. ప్రాజెక్టు వద్ద సెల్ఫీలు తీసుకుని, వారికి భోజనం తినిపించి, అక్కడే కాసే పు సేదదీరారు.
అనంతరం ప్రాజెక్టు 20వ వరద గేటు వద్ద ఆరేపల్లి శివారులో తెప్పపై పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రాజెక్టు నీటి మధ్యలోకి తీసుకెళ్లాడు. అక్కడ పిల్లలిద్దరినీ నీటిలోకి తోసేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అల్లుడు నవీన్‌కు ఫోన్ చేసి నీటిలోకి దూకేశాడు. మృతుడి అన్న సాయిలు ఫిర్యాదు మేరకు ఎస్సై శివకుమార్ శుక్రవారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకొని బాన్సువాడ అగ్నిమాపకశాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణ, రక్షిత్, అనన్య మృతదేహాలు లభ్యం కావడంతో వాటిని ఒడ్డుకు చేర్పించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.