జిల్లాలో వానకాలం సాగు జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడుగా ప్రకృతి కూడా సహకరిస్తుండడంతో అంచనాలకు మించి పంటలు సాగు చేస్తున్నారు. 5 లక్షల9వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనాలు సిద్ధం చేయగా ఇప్పటి వరకు 4లక్షల11వేల213 ఎకరాల్లో సాగు చేశారు. అతిభారీ వానలకు వరి నారు దెబ్బతినడంతో రైతులు మరోసారి నారు పోశారు. ఆశించిన స్థాయి వర్షాలతో రైతులు జోరు పెంచారు. రెండు వారాలుగా రైతులు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల చివరి వారం వరకు పనులు కొనసాగే అవకాశమున్నది. ఏటా వానకాలంలో దొడ్డురకం వరి సాగు చేసే రైతులు ప్రస్తుతం సన్నరకం వైపు మొగ్గు చూపారు. 50శాతానికి పైగా సన్నరకాలే సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల క్షేత్రపర్యటనల్లో వెల్లడైంది. మరోవైపు సాగుకు ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలోని 89 సహకార సంఘాల ద్వారా దాదాపు 15వేల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీకి సిద్ధంగా ఉంచింది. ప్రస్తుత సమయంలో వరి వేయాలనుకునే వారు వెదజల్లే పద్ధతిని అవలంబిస్తే మేలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం పంటల సాగు జోరుగా కొనసాగుతున్నది. గతానికి భిన్నంగా ఈసారి నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలకు మించి భారీ విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. సమృద్ధిగా వర్షాలు కురవడంతో నేల తడిసి ముద్దయ్యింది. జల వనరుల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. తెరిపినిచ్చిన వర్షంతో సేద్యానికి కాలం కలిసి వచ్చింది. జూలై మూడో వారం వరకు దంచి కొట్టిన వానలతో ఇంటికే పరిమితమైన కర్షకులు రెండు వారాలుగా సాగు పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి రైతన్నలంతా సాగు పనుల్లో మునిగి తేలుతుండడంతో అక్కడక్కడా కూలీల కొరత ఏర్పడుతున్నది. మరోవైపు గతం మాదిరిగానే బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, నల్లగొండ ప్రాంతాల నుంచి కూలీలు మన ప్రాంతానికి వలస కట్టడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. 5లక్షల 9వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేయగా 4లక్షల 11వేల 213 ఎకరాల్లో పంటలు సాగవ్వడంతో 91శాతానికి చేరింది. అతి భారీ వానలతో నారుమడులు చెడిపోయాయి. దీంతో రైతులు మరోసారి నారుమళ్లు వేసుకోవడంతో కొన్ని చోట్ల వరి నాట్లకు జాప్యం ఏర్పడింది. ఇలాంటి చోట్ల వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే మంచిదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
సన్నాలకు భారీ డిమాండ్..
ప్రజల్లో వచ్చిన మార్పులతో ఏటా వానకాలంలో అన్నదాతలు సైతం వైవిధ్యతను చూపిస్తున్నారు. ఏటా దొడ్డు రకం వరికే ఆసక్తి చూపిన రైతులంతా గత కొంత కాలంగా మార్పును కోరుకుంటున్నారు. సన్నాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడడంతో స్వచ్ఛందంగా సాగుకు మొగ్గు చూపుతున్నారు. 3లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగవ్వగా ఇందులో 50శాతానికి పైగా సన్నరకాలే ఉన్నట్లుగా వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటనల్లో తేలింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కిరికిరికి తోడుగా స్వతహా పంట మార్పిడి చేయడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్రైవేటు మార్కెట్లో సన్నాలకు డిమాండ్ ఉండడంతోపాటు ప్రైవేటు వ్యక్తులు తమ కుటుంబ అవసరాలకు సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా రైస్‌మిల్లుల్లో మర ఆడించి ఇంటి అవసరాలకు బియ్యాన్ని వినియోగిస్తున్నారు. సన్నాల్లో జైశ్రీరాం బ్రాండ్‌కు ఎక్కువ మంది ఎగబడుతుండడంతో రైతులు సైతం వీటినే సాగు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా ఒప్పందాలను సైతం చేసుకుంటున్నారు. పంట పండించిన తర్వాత క్వింటాళ్ల కొద్దీ పంపకాలు ఏకంగా కల్లంలోనే జరుగుతుండడం గత కొంత కాలంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
పుష్కలంగా ఎరువులు..
నిజామాబాద్ జిల్లాలో 2022 వానకాలంలో 66శాతం రాయితీపై 16074 క్వింటాళ్ల జీలుగ, 300 క్వింటాళ్ల పెద్ద జనుము విత్తనాలు సహకార సంఘాల ద్వారా టీఎస్ఈఈడీ పోర్టల్‌లో నమోదు చేసి రైతులకు పంపిణీ చేశారు. 89 సహకార సంఘాల ద్వారా దాదాపుగా 15వేల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మెజార్టీ భాగం రైతులకు అందించారు. 2022-23 వానకాలం సాగు ప్రణాళికల్లో 4లక్షల 2వేల ఎకరాల్లో వరి, 60వేల ఎకరాల్లో సోయాబీన్, 33వేల ఎకరాల్లో మక్కజొన్న, ఇతర పంటలను కలుపుకొని 5లక్షల 9వేల ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. 2021 వానకాలంలో మొత్తం 4లక్షల 92వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి 5లక్షల ఎకరాలు దాటే అవకాశాలున్నాయి. సాధారణ పంటల విస్తీర్ణం 4లక్షల 50వేల ఎకరాలుండగా 5.09లక్షల ఎకరాలకు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అత్యధికంగా వరి సాగులో రైతులు జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే 3లక్షల 19వేల ఎకరాల్లో వరి నాట్లు వేయగా 29వేల ఎకరాల్లో మక్కజొన్న, 59వేల ఎకరాల్లో సోయాబీన్, 2వేల ఎకరాల్లో పత్తి సాగైంది. ఆగస్టు చివరి వారం వరకు వ్యవసాయ పనులు కొనసాగే అవకాశాలున్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
ప్రతి సీజన్లోనూ సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరుగుతున్నది. నీటి వసతి విస్తరించిన కొద్దీ సాగులోకి వస్తున్న భూమి ఎగబాకుతున్నది. గతంలో చెరువుల్లో నీళ్లు లేక, వానలు సరిగా కురవక రైతులు పంటలు వేసేందుకు ధైర్యం చేసేది కాదు. ప్రస్తుతం వానకాలంతో సంబంధం లేకుండా గ్రామాల్లో సాగు నీళ్లు అందుబాటులో ఉండడంతో రైతన్నలు ధైర్యంగా సాగు చేస్తున్నారు. మరోవైపు రైతుబంధు డబ్బులు సకాలంలో రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. పంటల సాగుకు సీఎం కేసీఆర్ నేరుగా పెట్టుబడి సాయం అందించడంతో అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. రంది లేకుండానే పంటలు పండించేందుకు అన్నదాతలు ముందడుగు వేయడానికి ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో ఉందని గ్రామాల్లో సామాన్య ప్రజానీకం చర్చించుకుంటున్నది.
వెదజల్లే పద్ధతి మేలు..
వానకాలం సాగు ముగింపునకు చేరుకుంటున్నది. ఆగస్టు చివరి వరకు జిల్లాలో వరి నాట్లు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత సమయంలో వరి వేయాలనుకునే వారు, నీటి వసతి ఉన్న వాళ్లు నేరుగా వెదజల్లే పద్ధతిని అవలంబిస్తే మేలు. ఇక డీఏపీ బదులుగా కాంప్లెక్స్ ఎరువులు వాడుకోవడం ఉత్తమం. యూరియాను దఫదఫాలుగా వినియోగించాలి. కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది. మక్క, సోయా సాగు చేస్తున్న వారంతా పంట పొలాల్లో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి.
– తిరుమల ప్రసాద్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి