బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొలాల వద్దకే యూరియా వచ్చేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఎరువుల కోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అష్టకష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. వానకాలం ప్రారంభంలోనూ రైతులకు యూరియా కొనుగోలుపై కొర్రీలు పెట్టిందని మండిపడుతున్నారు. యాప్‌తో నానా అవస్థలు పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్‌తోనూ తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బాన్సువాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు బాన్సువాడలోని గ్రోమోర్ దుకాణంలో యూరియా స్టాక్ ఉన్నట్లు చూపడంతో యాప్ ద్వారా బుక్ చేసుకున్నాడు. ఎరువుల కోసం దుకాణానికి వెళ్లగా తమ వద్ద స్టాక్ లేదని షాపు నిర్వాహకులు చెప్పడంతో రైతు కంగుతిన్నాడు. యాప్‌లో ఎరువులు ఉన్నట్లు చూపిస్తున్నదని వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం మండల వ్యవసాయాధికారి దృష్టికి తీసుకెళ్లగా యాప్‌లో సాంకేతిక లోపం ఉన్నదని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం గమనార్హం.
బాన్సువాడ, ఆగస్టు 23 : మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌తో ఇబ్బందులు పడుతున్న రైతులపై మరో పిడుగు పడింది. కేంద్రం ఇప్పుడు మరో కొత్త యాప్ తీసుకువచ్చింది. ఇకపై ఎరువుల విక్రయానికి వ్యవసాయశాఖ కొత్తయాప్నే అమలుచేస్తున్నది. యూరియాతోపాటు అన్ని రకాల ఎరువులను ఈ యాప్ ద్వారానే విక్రయించనున్నది. రైతులకు పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా ఎరువులు అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ ’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న యాప్‌తో ఇబ్బందులు పడుతున్న రైతులపై ఇప్పుడు ఈ కేంద్రం రూపొందించిన ఈ యాప్‌ను వారి నెత్తిన రుద్దుతున్నది.
కొత్త యాప్‌లో రైతులు భూమి వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం సీజన్లో సాగుచేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలి. భూమి విస్తీర్ణం, పంటల ఆధారంగా అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే యాప్‌లో రైతులు తమ సాగుచేస్తున్న భూమి విస్తీర్ణం వివరాలను నమోదు చేసినప్పటికీ, మండల వ్యవసాయాధికారి తన యాప్‌లో పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుం ది. కానీ యాప్‌లో భూమి విస్తీర్ణం వివరాలను నమోదు చేసినా, మండల వ్యవసాయ శాఖ అధికారి లాగిన్‌లో కనిపించడంలేదు. ఇతర జిల్లాల రైతుల వివరాలు కనిపిస్తున్నా, బాన్సువాడ ప్రాంత రైతుల వివరాలు కనిపించడంలేదు. దీంతో యాప్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెప్పడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. భూమి విస్తీర్ణం, పంటల వివరాలు యాప్‌లో కనబడితేనే వారికి యూరియా తీసుకునే ఆవకాశం ఉంటుంది. యాప్‌లో వివరాలు లేకుంటే యూరియా బుక్ చేసుకునే ఆవకాశం ఉండదని రైతులు వాపోతున్నారు. పంటలకు ఎరువులు వేసే సమయం దాటిపోతున్నదని, యాప్‌తో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన చెందుతున్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన యాప్ రైతులను అయోమయంలోకి నెట్టింది. ఈ యాప్ వినియోగించడం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన యాప్‌తో అష్టకష్టాలు పడి ఎరువులు కొనుగోలు చేసిన రైతులు కొత్త యాప్‌తో నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. బాన్సువాడ మండలంలోని రైతులకు కొత్త యాప్ తంటాలు తెచ్చిపెడుతున్నది. కొంతమంది రైతులు బాన్సువాడలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో యూరియా స్టాకు ఉన్నట్లు చూపడంతో బుక్ చేసుకున్నారు. అక్కడికి వెళ్లిన రైతులకు దుకాణంలో యూరియా స్టాక్ లేదని చెప్పడంతో షాపు సిబ్బందితో గొడవకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. తమ ఫోన్ లాగిన్‌లో స్టాక్ ఉన్నట్లు లేదని, కానీ యూరియా బుకింగ్ యాప్‌లో స్టాక్ ఉన్నట్టు చూపడంతో ఇలా జరిగిందని రైతులకు సర్దిచెప్పారు.
బాన్సువాడ మండల రైతులు గ్రోమోర్లో యూరియా ఉన్నట్లు చూపడంతో బుక్ చేసుకున్నారు. వాస్తవంగా మా లాగిన్‌లో గ్రోమోర్లో స్టాక్ లేదు. యాప్‌లో ఏదో సాంకేతిక సమస్యతో స్టాక్ చూపడంతో రైతులు యూరియా బుక్ చేసుకొని ఇబ్బంది పడ్డారు. దుకాణానికి వెళ్లి బుకింగ్ చేసుకున్నవారు యూరియా ఇవ్వాలని గొడవకు దిగారు. ఈ సమస్యను పరిశీలిస్తాం. అంతే కాకుండా భూమి వివరాలను యాడింగ్ చేసుకున్న రైతుల వివరాలు మా లాగిన్‌లో కానరావడం లేదు. ఇతర జిల్లాల రైతుల వివరాలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.