Farmers protest | కోటగిరి, అక్టోబర్ 23 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట రైతులకు దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోటగిరి-పోతంగల్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు.
సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో బస్తా 41 కిలోల వడ్లు తూకం పెట్టాల్సి ఉండగా అదనంగా అర కిలో చొప్పున తరుగు తీస్తున్నారాని దింతో పాటు లారీ రైస్ వెళ్లిన తర్వాత కూడా అక్కడ రైతును పిలిచి, బియ్యం ఉతారు రావడంలేదని మళ్లీ అదనంగా తరుగు తీస్తామని నిబంధనలు పెట్టి మిల్లర్లు రైతులకు బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. తహసీల్దార్ మా రైతుల దగ్గరికి వచ్చి తమకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇంతసేపటికి తహసీల్దార్ రాకపోవడం వల్ల రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. ఈ విషయం తెలుసుకున్న కోటగిరి ఎస్సై సునీల్ పోలీసు సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఆందోళన విరమించాలని ఎస్సై రైతులు నచ్చజెప్పినా వినకుండా తమకు అన్యాయం జరిగిందని, తరుగు పెరిట రైతులకు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ వచ్చి తమకు న్యాయం చేయాలని, పూర్తి హామీ కల్పించాలని రైతులు భిష్మించుకుని కూర్చున్నారు. అంతలోనే ఓ రైతు పురుగుల మందు తాగేందుకు యత్నం చేశారు. అంతలోనే పోలీస్ లు మందు డబ్బా లాక్కున్నారు. అనంతరం ఎస్సై సునీల్ తహసీల్దార్ తో మాట్లాడడం తో తహసీల్దార్ గంగాధర్ సంఘటన స్థలానికి చేరుకొని రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. మొన్నటి వరకు 41 కిలోలు కాంట చేశారని, నాలుగు రోజుల నుండి తరుగు పేరిట 41.500 కాంట చేస్తున్నారని బస్తాకు అదనంగా 500 గ్రా. తరుగు తీస్తున్నారని రైతులు మండిపడ్డారు.
రైస్ మిల్లర్లతోసమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడి తరుగు లేకుండా చేస్తామని తహసీల్దార్ గంగాధర్ హామీ ఇవ్వడం తో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో తెల్ల రవికుమార్, ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, తెల్ల చిన్న అరవింద్, అంబాటి గంగ ప్రసాద్ గౌడ్, రమణ, వాసుబాబు, సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.