రుణమాఫీపై సర్కారు తీరుతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని అర్హతలున్నా మాకు రుణమాఫీ రాలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరేమో అప్పులు తెచ్చి వడ్డీ కట్టినా మాఫీ వర్తించకపోవడంతో లబోదిబోమంటున్నారు. బ్యాంకు వెళ్తే.. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాలని…ఆఫీసర్లను కలిస్తే బ్యాంకుకు వెళ్లాలంటూ తిప్పుతున్నారని మండిపడుతున్నారు. భారమైనా భరిస్తూ ఎక్కడికెళ్లినా సరైన స్పందన రావడం లేదంటున్నారు. ప్రభుత్వం చేసిన రుణమాఫీ మూడు విడుతలూ గందరగోళంగా మారాయని విమర్శిస్తున్నారు. అందరికీ మాఫీ చేస్తామని నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొర్రీల పేరిట కర్రుకాల్చి వాత పెట్టిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
– నాగిరెడ్డిపేట/కోటగిరి, ఆగస్టు 26
కోటగిరి, ఆగస్టు 26: నాపేరు దుమాలే మానప్ప. హెగ్డోలి శివారులో1.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఎత్తొండ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులోరూ.96012 క్రాప్‌లోన్ ఉన్నది. హెగ్డోలి శివారులో నా భార్య దుమాలే లత పేరిట రెండు ఎకరాలు ఉన్నది. లత పేరిట హెగ్డోలి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1,04,032 క్రాప్ లోన్ తీసుకున్నం. ఇద్దరికీ కలిపి రూ.2,00,044 లోన్ ఉన్నది. మాకు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని వ్యవసాయాధికారికి అడిగితే మీరు తీసుకున్న లోన్ రూ.2లక్షల కన్నా 44 రూపాయలు అధికంగా ఉన్నదని, ప్రస్తుతం పరిశీలనలో ఉన్నదని చెప్పిండ్రు.
– దుమాలే మానప్పా, రైతు, హెగ్డోలి
నాగిరెడ్డిపేట, ఆగస్టు 26: మా కుటుంబానికి యూనియన్ బ్యాంకులో రూ.2లక్షల క్రాప్‌లోన్ ఉన్నది. మూడో విడుత అయిపోయినా రుణమాఫీ వర్తించలేదు. నా భార్య భూదమ్మకు, నాపేరున చెరో రూ.లక్ష చొప్పున రూ.రెండు లక్షల లోన్ ఉన్నది. రెండో విడుత రుణమాఫీ ప్రకటించిన తర్వాత వెళ్లితే..ఇద్దరికీ రూ.లక్ష చొప్పున రుణమాఫీ పోగా భూదమ్మ రూ.12వేల మిత్తి, నా పేరిట రూ.12వేల మిత్తి కట్టేస్తే వర్తిస్తుందని చెప్పిండ్రు. వెంటనే మిత్తి కట్టేశాను. తర్వాత వెళ్లి అడిగితే రుణమాఫీ కాలేదని చెబుతున్నారు.
– నాయికోటి రాములు, మాల్తుమ్మెద
ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. నా పేరున రూ.లక్షా20వేలు, నా కొడుకు యాదగిరి పేరిట రూ.70వేలు యూనియన్ బ్యాంకులో క్రాప్‌లోన్ తీసుకున్న. నెల రోజుల నుంచి బ్యాంకు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. బ్యాంకుకు వెళ్తే వ్యవసాయ శాఖ కార్యాలయం వెళ్లమంటున్నారు.
– కొర్వి సత్యనారాయణ, మాల్తుమ్మెద
నాకు ఉన్నదే ముప్పావు ఎకరం భూమి. తీసుకున్న రుణం, మిత్తి కలిపి రూ.18 వేలు ఉన్నది. కానీ ఇప్పటికీ మాఫీ కాలేదంటున్నారు. రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. బ్యాంకోళ్ల తప్పా లేక వ్యవసాయ శాఖోల్ల తప్పొ తెలియదు. కానీ, మాకు మాత్రం నిత్యం చుక్కలు చూపిస్తున్నారు.
– అగ్గు పాపయ్య, తాండూర్
నా పేరు మీద మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉండడంతో యానియన్ బ్యాంకులో రూ.లక్ష లోన్ తీసుకున్న. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ కాలేదు. బ్యాంకు సిబ్బందిని అడిగితే వ్యవసాయ శాఖ వద్దకు వెళ్లమంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే రూ.లక్ష రుణమాఫీ ఎప్పుడో అయ్యింది. మేనేజర్‌ను అడుగుమంటున్నారు. నెల రోజుల నుంచి తిరుగుతూనే ఉన్న. అందరికీ వచ్చింది.. మాకెందుకు ఇవ్వడం లేదో..అర్థం కావడం లేదు. నెల రోజులుగా తిప్పలు పెడుతున్నారు.
– పోచమ్మల సిద్ధిరాములు,మేజర్వాడీ