జనవరి 6 : రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్‌పై రైతాంగం కన్నెర్ర చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి రైతులకు ధోకా చేసింది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి రూ.7,500 ఇస్తానని ఎన్నికల ప్రచార సభలో ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, తీరా గెలిచాక ఇప్పుడు ఎకరానికి రూ.12వేలు ఇస్తామని ప్రకటించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్లారెడ్డి, బాల్కొండ, కమ్మర్పల్లి, వేల్పూర్, ముప్కాల్, నవీపేటలో ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రైతుభరోసాపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.