భారీ వర్షాలు అన్నదాతల ఆశలను నిండా ముంచాయి. వేలాది ఎకరాల్లోని పంటలు వరదనీట మునిగాయి. మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో చెరువులు, కుంటలు ఉప్పొంగడంతో వర్షపు నీరు పొలాల్లోకి చేరింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 1.5లక్షల ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. కష్టాల్లో ఉన్న రైతులు, ప్రజలను అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న దాఖలాల్లేవు. వ్యవసాయ అధికారులైతే అన్నదాతలను గాలికొదిలేశారు. వానలతో పాటు వరద తగ్గుముఖం పడితే కానీ ఎంత నష్టం జరిగిందని అంచనా వేసే పరిస్థితి లేదని చెబుతున్నారు.
-నిజామాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
భారీ వర్షాలతో ప్రధానంగా ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, ఒర్రెల పక్కన పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. జుక్కల్ నియోజకవర్గంలో మక్కజొన్న, వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. పెద్దకొడప్గల్, పిట్లం, జుక్కల్, బిచ్కుంద తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో మక్క దెబ్బ తిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
హన్మాజీపేట్, సంగోజీపేట్, కాద్లాపూర్ శివారులో సాగు చేస్తున్న మొక్కజొన్న, సోయా, పత్తి పంటలు నీట మునిగాయి. ఇబ్రహీంపేట్, రాంపూర్, దేశాయిపేట్, సోమేశ్వర్ తదితర గ్రామాలలో వరి పంటలు సైతం నీట మునిగాయి. వ్యవసాయ భూముల్లో వరద నీటిని నిలకడ లేకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ చెబుతున్నది.
భారీ వర్షాలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల ఎకరాల్లో వరి పంటలైతే కనిపంచకుండా వరద నీటిలో మునిగాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ భూములు చెరువును తలపిస్తున్నాయి. రైతుల భూముల్లో ఇసుక మేటలు తేలుతున్నాయి. నెల రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆపత్కాలంలో అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఒక్కరూ రాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ జనాల్లోకి వెళ్లి వారి కష్ట, నష్టాలను తెలుసుకునే ప్రయత్నమే ఉమ్మడి జిల్లాలో చేయలేదు.