రామారెడ్డి, మే 21: రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ వద్ద జీలుగ విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 6 గంటలకే సొసైటీకి చేరుకొని క్యూలో నిల్చున్నారు. మండలంలో దాదాపు 10వేల మంది రైతులుండగా కేవలం 666 బ్యాగులు మాత్రమే వచ్చాయి. విత్తనాల పంపిణీ విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొంతమందికి మాత్రమే జీలుగ విత్తనాలు లభించడంతో మిగతా వారు నిరాశతో వెనుదిరిగారు. గత ప్రభుత్వ హయాంలో మే నెల మొదటి వారంలోనే సరిపడా విత్తనాలను సరఫరా చేసేవారని రైతులు గుర్తుచేశారు. విత్తనాల కొరతపై మండల వ్యవసాయాధికారి హరీశ్కుమార్ను వివరణ కోరగా తాము 500 క్వింటాళ్ల జీలుగ, 100 క్వింటాళ్ల పెద్ద జనుము విత్తనాలు పంపించాలని కోరామని, విడుతల వారీగా వస్తాయని ఉన్నతాధికారులు తెలిపినట్లు చెప్పారు. సర్కారు మారింది.. పెద్ద మార్పే వచ్చిందని పలువురు అన్నదాతలు సెటైర్లు వేయడం కనిపించింది.