రాజంపేట/భిక్కనూరు/ కామారెడ్డి రూరల్/నిజాంసాగర్, సెప్టెంబర్ 3: రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. యూరియా కోసం రోజంతా గోదాముల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గంటల తరబడి వరుసలో నిల్చున్నా అందని పరిస్థితి. అదను మీద యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం యూరియాను అరకొరగా సరఫరా చేయడంతో అందని రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజంపేట మండలంలోని తలమడ్ల సొసైటీకి 15 రోజుల తర్వాత యూరియా రావడంతో గోదాము వద్ద గురువారం ఉదయం 8 గంటల నుంచే రైతులు బారులు తీరారు. మొత్తం 222 బస్తాల యూరియా రాగా దాదాపు 300 మంది రైతులు క్యూలో నిల్చున్నారు. పాస్ పుస్తకానికి ఒకటి చొప్పున యూరియా బస్తా పంపిణీ చేయగా..50 మంది రైతులు అందక నిరాశతో వెనుదిరిగారు.
బీబీపేట సొసైటీ వద్ద కూడా రైతులు పెద్ద సంఖ్యలో పడిగాపులు కాశారు. సొసైటీకి 440 బస్తాల యూరియా రాగా పంపిణీ చేసినట్లు సీఈవో నర్సాగౌడ్ తెలిపారు. మహ్మద్‌నగర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లారీ లోడ్ రావడంతో పాస్ పుస్తకానికి ఒకటి చొప్పున యూరియా పంపిణీ చేశారు. ప్రస్తుతం పంటలకు అత్యవసరం ఉన్నదని, అధికారులు సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు.