ధర్పల్లి, సెప్టెంబర్ 2 : సకాలంలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో యూరియా కొరత.. రైతులకు శాపంగా మారింది. అరకొర యూరియా సరఫరా చేస్తుండగా.. గోదాముల వద్ద అన్నదాతలు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. క్యూలో నిల్చున్నా యూరియా దొరుకుతుందన్న గ్యారెంటీ ఉండడంలేదు.
ధర్పల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలియగానే మంగళవారం ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. సొసైటీకి 400 బస్తాలు రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున అందజేశారు. కొంతమంది రైతులకు యూరియా అందకపోవడంతో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు. త్వరలోనే యూరియా వస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి తెలిపారు.