రెంజల్, ఏప్రిల్ 28 : ‘మేము సన్న, చిన్నకారు రైతులం..రుణమాఫీకి అర్హులం.. మాకు రుణమాఫీ చేయండి సార్..’ అంటూ నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుతో మొరపెట్టుకున్నారు పలు గ్రామాల రైతులు. రెంజల్ మండల కేంద్రంలో భూభారతిపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని తిరిగివెళ్తుండగా.. రెంజల్, దూపల్లి గ్రామాల రైతులు చుట్టుముట్టారు.
వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన సన్నకారు, చిన్నకారు రైతులకు రుణమాఫీ వర్తింపజేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వేడుకున్నారు. రెంజల్లో గన్నీ సంచులు, లారీల కొరత తీర్చాలని కోరారు. అలాగే దూపల్లికి చెందిన ఓ మహిళ తన అర ఎకరం భూమి కబ్జాకు గురైందని, న్యాయం కోసం కలెక్టరేట్‌తోపాటు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయినట్లు కలెక్టర్‌తో మొర పెట్టుకున్నది. తనకు న్యాయం చేయాలని కోరింది.