ఆర్మూర్‌టౌన్, ఆగస్టు 26: కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు షరతుల్లేని రుణమాఫీ, రూ.7500 చొప్పున రైతుభరోసా హామీలను వెంటనే అమలు చేయాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహాన్ని రేవంత్ ప్రభుత్వం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్మూర్‌లో ఇటీవల పార్టీలకు అతీతంగా, శాంతియుతంగా నిర్వహించిన మహాధర్నా ప్రభుత్వంలో చలనం తెప్పించిందన్నారు. సెప్టెంబర్ 15లోగా అర్హులందరికీ రూ.2 లక్షల మాఫీ చేయాల్సిందేనని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఆర్మూర్‌లో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఇట్టడి లింగారెడ్డి, ప్రభాకర్, దేగాం యాదాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 24న నిర్వహించిన మహాధర్నాను విజయవంతం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధులగుట్ట సాక్షిగా ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. కొంత మందికి రుణాలు మాఫీ చేసి, మిగతా వారికి ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని యాదాగౌడ్ అన్నారు.
రూ.2 లక్షలకు పైనున్న రుణాలను ముందుగా కడితేనే మాఫీ చేస్తామన్న షరతును తొలగించాలని డిమాండ్ చేశారు. రుణాల మాఫీతోపాటు రైతుభరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న రూ.5 వేలు సరిపోవడం లేదని, అధికారంలోకి వస్తే రూ. 7,500 అందిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, సెప్టెంబర్ వస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుభరోసా అమలు విషయంలోనూ కుట్రలు, కుతంత్రాలకు ప్రభుత్వం తెరలేపుతున్నట్లు కనిపిస్తున్నదన్నారు. రేషన్‌కార్డు, కుటుంబాలను ప్రామాణికంగా తీసుకోకుండా అర్హులైన అందరి రుణాలను రద్దు చేయాలని వి.ప్రభాకర్ స్పష్టం చేశారు. రైతులు చేపట్టిన మహా ధర్నాతో ప్రభు త్వం దిగివచ్చినట్లే కనిపిస్తున్నా, మరో కండీషన్‌ను తెర పైకి తెచ్చారని ఇట్టడి లింగారెడ్డి తెలిపారు. రైతుభరోసా, రుణమాఫీ యాప్ తీసుకొచ్చిందని, రైతులే కుటుంబాలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణ ఇవ్వాలనడం, డిక్లరేషన్‌లో తప్పులుంటే శిక్షిస్తామనడం దా రుణమన్నారు. కాలయాపనకే ఇలాంటివన్నీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన లింగారెడ్డి.. కాలయాపన చేస్తే ప్రభుత్వానికి ఉద్యమ తీవ్రత చూపిస్తామన్నారు.
ఖలీల్‌వాడి, ఆగస్టు 26: అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వెంటనే చేయాలని ఈ నెల 29న మండల కేంద్రాల్లో ధర్నా చేపట్టనున్నట్లు సీపీఎం నాయకుడు రమేశ్‌బాబు తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.రెండు లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని, రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.