Fake | నిజామాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నగరానికి చెందిన రాజేందర్ బల్బు కోసం ఓ ఎలక్ట్రిక్ షాపుకెళ్లాడు. సదరు షాపు యజమాని ఎల్ఈడీ బల్బులు చూపించాడు..లేటెస్టుగా ఇప్పుడిదే అందరూ వాడుతున్నారంటూ చెప్పాడు. రాజేందర్ గ్యారంటీ గురించి అడుగగా.. చెప్పలేమండి..ఇప్పటికే చాలా మంది తీసుకెళ్లారు.. ఒక్కసారి వాడి చూడండి అంటూ బల్బును చెక్‌చేసి చూపించాడు. దీంతో రాజేందర్ అడిగినన్ని డబ్బులు ఇచ్చి బల్బును తీసుకెళ్లాడు. ఇంటికెళ్లిన తర్వాత బల్బును ఆన్‌చేయగా..ఓ పదినిమిషాలు వెలిగి తర్వాత కాలిపోయింది. వెంటనే సదరు షాపు యజమాని వద్దకు వెళ్లి అడుగగా.. తానేం చేయలేనని, గ్యారంటీ ఇవ్వలేమని ముందే చెప్పామంటూ
మోసపోవడం రాజేందర్ వంతయ్యింది. మార్కెట్లో ఒక వస్తువు వచ్చిందంటే చాలు.. అక్రమార్కులు అదే వస్తువును నకిలీగా తయారుచేస్తున్నారు. నకిలీ వస్తువును నిశితంగా పరిశీలిస్తేగానే గానీ తెలియకపోగా.. కొందరు వ్యాపారులు చెబితే గాని మనకు వాటిపై అవగాహన రాదు. ఇప్పటికే మార్కెట్లో హర్ ఏక్ మాల్ అంటూ వేల దుకాణాలు వెలిశాయి. ఇవి భవనాల్లో కాకుండా రోడ్డుపక్కన తోపుడు బండ్లపై కూడా విక్రయిస్తుంటారు.
మరోవైపు ఫేక్ ఐటమ్స్‌ను ఇష్టానుసారంగా అమ్ముకుని అధికంగా లాభాలు గడించాలని చూసే వ్యాపారుల ఎత్తుగడతో కొనుగోలుదారులు నష్టాలు చూస్తున్నారు. దుకాణాల్లో టెస్ట్ చేసినప్పుడు పని చేయడం నిమిషాల్లో ఇంటికెళ్లి వాటిని పరీక్షిస్తే పని చేయకపోవడంతో జేబులకు చిల్లులు వేసుకుంటున్న వారు అధికంగా ఉంటున్నారు. ఇదేమని దుకాణాదారున్ని అడిగితే వారంటీ, గ్యారంటీ ఉండదంటూ బుకాయిస్తున్నారు. రూ.కోట్లలో నకిలీ వస్తువుల దందా రాజ్యమేలుతోంది.
వందల దుకాణాల్లో ఈ తరహా వ్యాపారమే సాగుతోంది. బిల్లులు ఇవ్వరు, గ్యారంటీ రాదంటారు. క్వాలిటీ వస్తువులను చూపించకుండానే మాటల్లో ముంచెత్తి ఏదేదో చెప్పి అంటగడుతారు. తిరిగొచ్చి ప్రశ్నిస్తే మాత్రం జవాబివ్వకుండా దుకాణాదారులంతా ఏకమై కొనుగోలుదారులపైనే తిరగబడుతున్న ఘటనలు దేవీరోడ్డులో నిత్యం వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలో ఈ దీపావళికి పటాకులు సైతం చేరాయి. రూ.వేలల్లో కొనుగోలు చేసిన పటాకుల్లో తుస్సుమన్నవే ఎక్కువగా ఉన్నాయి. పేలిన పటాకులు తక్కువ ఉండగా పాత సరుకు, క్వాలిటీ లేని పటాకులను కొని ఎంతో మంది ఈసారి మోస పోవాల్సి వచ్చింది. పటాకుల అమ్మకాలపై ఫైర్ సేఫ్టీ యంత్రాంగం కేవలం రక్షణకే పరిమితం కాగా క్వాలిటీపై దృష్టి సారించలేదు.
ఇలా బడా వ్యాపారుల నుంచి చోటా వ్యాపారుల దాకా సామాన్యులను ముంచేస్తున్నారు. అధిక ధరలకు వస్తువులను విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. పేరూ, ఊరూ లేని వస్తువులను కొని ప్రజలు గంటల్లోనే మోస పోతున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలకు పెట్టింది పేరుగా నిలిచిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఈ తరహా మోసాలు నిత్యం బయట పడుతున్నాయి.
దీపావళి పండుగ వేళా మరింత ఎక్కువగా ఈ మోసాలకు సామాన్యులు గురయ్యారు. ఓ వైపు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి చిన్నా పెద్దా అంతా విలవిల్లాడుతుండగా.. నకిలీ వస్తువుల రూపంలోనూ జనాలంతా డొల్లా అవుతున్నారు. రూ.వందల్లో వెచ్చించిన వస్తువులు నాణ్యత లేకపోవడంతో నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి. నిజామాబాద్‌లో గాంధీచౌక్, నెహ్రూ చౌక్, కుమార్‌గల్లీ, దేవీ రోడ్డు, కామారెడ్డిలో గంజ్ ప్రాంతం, రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతమంతా ఇందుకు అడ్డాగా మారుతోంది. పట్టించుకోవాల్సిన సంబంధిత అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో తూగుతుండడం మూలంగా సామాన్యులపైనే ఈ ప్రభావం పడుతోంది.
ఎల్ఈడీ బల్బులు వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్స్‌లో కొంగొత్త వస్తువులు వచ్చాయి. ఇందులో నాణ్యత ఉన్నవి, నాణ్యత లేనివి పుట్టెడు పుట్టుకొచ్చాయి. చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులైతే అనేకం. షిప్పుల ద్వారా, దొంగ రవాణా ద్వారా నిజామాబాద్‌కు ఎలాంటి లేబుళ్లు లేకుండా వచ్చి పడుతున్న వస్తువులతో సామాన్యుల నెత్తిపై ఎనలేని భారం పడుతోంది. బ్రాండెడ్ ఐటమ్స్ కొనుగోలు చేద్దామనుకుంటే ఆకాశాన్ని తాకే ధరలతో కుదేలవ్వాల్సి వస్తోంది. ఎమ్మార్పీ పేరుతో జరిగే దోపిడీ భారం నుంచి ఉపశమనం కోసం సామాన్యులు ఇతరత్రా మన్నికైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటున్నారు.
పరిశ్రమల నుంచి ఉత్పత్తి జరిగే ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ వస్తువుల అమ్మకాలపై ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, జీఎస్టీ బాధ్యులు తనిఖీలు నిర్వహించి ఫేక్ ఐటమ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సి ఉండగా అలాంటిదేమీ చేయడం లేదు. ఫలితంగా వ్యాపారులు ఇష్టానుసారంగా చైనా ఉత్పత్తులను అమ్ముతూ ప్రభుత్వానికి సైతం నష్టం చేస్తున్నారు.
కొనుగోలుదారుడు చెల్లించిన మొత్తంలో పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి కాసింత ఆదాయం సమకూరాలి. కానీ ఫేక్ ఐటమ్స్‌కు బిల్లులు లేకపోవడంతో ఆదాయం రావడం లేదు. తద్వార ప్రభుత్వాలకు సైతం నష్టం వాటిల్లుతున్నది. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటే ఇదంతా క్రమబద్ధంగా జరిగేది. మచ్చుకూ తనిఖీలు లేకపోవడంతో వ్యాపారుల ఆగడాలు మితిమీరి పోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చైనా ఉత్పత్తులతో భారతీయ ఉత్పత్తులు పోటీ పడడం లేదు. పక్క దేశాల నుంచి దొడ్డి దారిలో దిగుమతి అవుతన్న అనేక వస్తువులకు లోకల్ లేబుల్లు అతికించి విక్రయాలు చేస్తున్నారు. వీటిని సైతం కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులతో ములాఖత్ కావడం వల్లే దొందూ దొందే అన్నట్లుగా పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తనిఖీలను ముమ్మరం చేస్తే ఫేక్ ఐటమ్స్ రూ.కోట్లలో డంపులు దొరకడంతో పాటుగా ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయం సక్రమ మార్గంలో వచ్చే వీలుందని ఆయా రంగాల నిపుణులు సైతం సూచిస్తున్నారు.