వినాయక్‌నగర్, జూన్ 20: మొన్న స్వధార్.. నేడు గాడ్స్. స్వచ్ఛంద సంస్థల పేరిట దివ్యాంగ పిల్లల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో కొనసాగుతున్న ఈ పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ తనిఖీల్లో వీటి బాగోతాలు వెలుగుచూస్తున్నాయి.
తాజాగా జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ బ్యాంక్ కాలనీలో ఉన్న గాడ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మూగ, చెవిటి పిల్లల స్కూల్‌ను జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు శుక్రవారం ఆకస్మికగా తనిఖీ చేశారు. 58 విద్యార్థులకు 28 మంది విద్యార్థులే ఉన్నారు. విద్యార్థులను బ్లాక్ బోర్డు పై తెలుగులో అక్షరాలు రాయాలని సూచించగా, సరిగా రాయకపోవడం, విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు లేకపోవడం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందుబాటులో కనిపించకపోవడాన్ని గమనించారు.దీంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘గాడ్స్’ నిర్వాహకురాలు శోభను అడి గి వివరాలు తెలుసుకున్నారు. నాలుగు నుంచి పదో తరగతి వరకు ఉన్నా మౌలిక వసతులు కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించా రు. మూగ, చెవిటి బాలల భవిష్యత్తు విద్యతో ముడిపడి ఉన్నందున, విద్యాబోధనలో నిర్లక్ష్యం తగదని నిర్వాహకులకు సూచించారు. ఈ స్కూళ్ల నిర్వహణపై వివరాలను కలెక్టర్, డీఈవోకు న్యాయసేవా సంస్థ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.