కేంద్ర సర్కారు నిర్లక్ష్యం కారణంగా దేశంలో పాల ఉత్పత్తి భారీగా పడి పోయింది. పాడి రైతులను ప్రోత్సహించడంలో, దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా విదేశాల నుంచి పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకునే పరిస్థితి దాపురించింది. అదే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వివిధ పథకాల అమలు ద్వారా పాల దిగుబడులను పెంచేందుకు కృషి చేస్తున్నది. అందుకోసం పాడి రైతును అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు చెల్లించే ధరను ఏడాదిలో మూడుసార్లు పెంచింది. ఈ నెల ఒకటి నుంచి బర్రె పాలు లీటర్‌కు రూ.7.10 చొప్పున, ఆవుపాలు లీటర్‌కు రూ.4.60 చొప్పున అదనంగా అందిస్తున్నది. పాడి పశువుల పెంపకంలో దాణా, గడ్డి తదితర పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో విజయడెయిరీకి పాల ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ఉమ్మడి జిల్లాలో వేలాది మంది పాడి రైతులకు ప్రయోజనం కలుగనున్నది.
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 7: పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నది. పాల దిగుబడిని పెంచేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. తాజాగా విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు పాల ధరను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో పాడి రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. పాడి రైతుల కోసం విజయ డెయిరీ పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు ఒక లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ను కూడా అందిస్తూ వస్తున్నది.
పాడి పశువుల పెంపకంలో దాణా, గడ్డి తదితర పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో విజయడెయిరీకి పాల ధరను పెంచుతున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పెంచిన పాలధర ఈ నెల 1వ తేది నుంచి అమలు చేయాలని విజయ డెయిరీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు పాల ధర పెంపు జీవోను కూడా విడుదల చేసినట్లు విజయ డెయిరీ జిల్లా అధికారి తెలిపారు.
6,500 మంది పాడి రైతులకు లబ్ధి
సారంగాపూర్‌లో ఉన్న నిజామాబాద్ విజయ డెయిరీకి జిల్లా వ్యాప్తంగా 6,500 మంది పాడి రైతులు పాలను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 5 వేల లీటర్ల పాలను విజయ డెయిరీ సేకరిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాల ధరను పెంచడంతో 6,500మంది పాడి రైతులకు లబ్ధి చేకూరినట్లవుతుంది. ఒక లీటర్ బర్రె పాలలో పది శాతం వెన్న ఉన్నట్లు యావరేజీగా తీసుకుంటే ప్రస్తుతం రూ.73 రైతుకు చెల్లిస్తున్నది. తాజాగా బర్రె పాలకు లీటర్‌పైన యావరేజీగా రూ.7.10 పైసలు పెరగడంతో ఇక నుంచి రూ.80.10 పైసలు చెల్లిస్తారు. లీటర్ పాలలో వెన్న శాతం 6 ఉంటే ఇప్పటి వరకు రూ.43.80 పైసలు చెల్లిస్తుండగా తాజాగా పెరిగిన ధరతో రూ.48.06 పైసలు చెల్లిస్తారు. ఆవు పాలు ఒక లీటర్లో 3 శాతం వెన్న ఉంటే రూ.35.65 పైసలు చెల్లిస్తుండగా పెరిగిన ధరతో రూ.40.25 పైసలు చెల్లిస్తారు. ఆవు పాలలో 4 శాతం వెన్న ఉంటే ఇప్పటివరకు రూ.38.75 పైసలు చెల్లిస్తున్నారు. తాజాగా పెరిగిన ధరతో లీటర్‌కు రూ.43.75 పైసలు చెల్లించనున్నారు. జిల్లాలోని ప్రైవేట్ పాల సేకరణ సంస్థలు విజయ డెయిరీ కన్నా తక్కువ ధరను చెల్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడి రైతులు ప్రైవేట్‌కు పాలు పోయకుండా విజయ డెయిరీ తరపున ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పాలు పోసేందుకు ఆసక్తి చూపాలని అధికారులు కోరుతున్నారు.
ఏడాదిలో మూడుసార్లు…
విజయ డెయిరీలో పాల సేకరణ పెంచేందుకు పాడి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక ఏడాదిలో మూడుసార్లు పాల ధరను పెంచింది. గతేడాది ఏప్రిల్ 16 నుంచి విజయ డెయిరీ పాల ధరను పెంచగా అదే ఏడాది సెప్టెంబర్ 1 నుంచి మరోసారి పాల ధర పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మళ్లీ తాజాగా ఇప్పుడు బర్రె పాలు ఒక లీటర్‌కు రూ.7.10 పైసలు పెంచగా ఆవు పాలైతే ఒక లీటర్‌పైన రూ.4.60 పైసలు పెంచి ఇవ్వనున్నారు. పాల ధర పెంచడంతో జిల్లాలోని పాడి రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
పెరుగనున్న పాల సేకరణ
ప్రభుత్వం పాల ధర పెంచడంతో జిల్లాలోని విజయ డెయిరీకి పాల సేకరణ కూడా పెరుగనున్నది. జిల్లాలోని వర్ని, బోధన్, కోటగిరి, ఆలూర్, నవీపేట్, ధర్పల్లిలో ఉన్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల (బీఎంసీఈ) నుంచి నిజామాబాద్ డెయిరీకి ప్రస్తుతం రోజుకు 5వేల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు. తాజాగా పెంచిన ధరతో పాల సేకరణ మరింత పెరుగనున్నదని విజయ డెయిరీ అధికారులు పేర్కొంటున్నారు.
రైతులను ప్రోత్సహించేందుకే..
పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను పెంచింది. పెరిగిన ధరలు ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చాయి. పాల ధర పెంపుతో విజయ డెయిరీకి పాల సేకరణ కూడా తప్పకుండా పెరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 118 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా రోజుకు 5 వేల లీటర్ల పాలను సేకరిస్తున్నాం.
– రమేశ్, మేనేజర్, విజయ డెయిరీ, నిజామాబాద్