కామారెడ్డి, మే 12: జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి సోమవారం నిర్వహించనున్న పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,80,921 మంది ఓటర్లు ఉండగా, 791 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇందులో 64 సమస్యాత్మక లొకేషన్లను గుర్తించి 64 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని వెల్లడించారు. కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
కామారెడ్డి పరిధిలో 27 రూట్లు, జుక్కల్‌లో 26, ఎల్లారెడ్డిలోని 29 రూట్లలో ప్రత్యేక వాహనాల్లో ఆదివారం ఎన్నికల బృందాలు నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లాయని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, అర్హులందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలని, బూత్‌లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 516 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.
కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రి పంపిణీని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌లిస్ట్ ప్రకారం సామగ్రిని సరిగా చూసుకోవాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి మార్గదర్శకాలను పాటించాలన్నారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం 7 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించాలన్నారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే రీప్లేస్ చేసేందుకు సెక్టోరల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి రూరల్, మే 12: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2,23,027 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 270 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 1,080 మంది సిబ్బందిని కేటాయించారు. అన్ని మండలాలను కలిపి 29 రూట్లుగా విభజించారు. ప్రతి రూట్‌కు ఒక రూట్ అధికారి, ఒక సహాయక అధికారిని నియమించారు. 169 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుచేశారు. వీరితోపాటు 575 మంది పోలీసులు ఎన్నికల విధులను నిర్వహించనున్నారు. కొంత మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు.
ఎల్లారెడ్డిలోని జీవదాన్ హైస్కూల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందజేశారు. ప్రత్యేక బస్సుల్లో సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం సామగ్రితో తరలివెళ్లారు. సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లను పోలింగ్ కేంద్రాల వద్ద సమకూరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి మండలంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిలో మహిళల కోసం నాలుగు పోలింగ్ కేంద్రాలు, నాగిరెడ్డిపేట మండలంలో ఒక మహిళా పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.
మద్నూర్, మే12: పోలింగ్ కోసం జుక్కల్ నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మద్నూర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో సిబ్బందికి సామగ్రిని అందజేసి వారికి కేటాయించిన గ్రామాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో తరలించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి విధులను నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం 255 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
బాన్సువాడ, మే 12: బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 258 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, బాన్సువాడ ఆర్డీవో రాథోడ్ రమేశ్ తెలిపారు. ఇందుకోసం 26 రూట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 40 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన ఆదివారం పర్యవేక్షించారు. మొత్తం 2500 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఒక దివ్యాంగుల పోలింగ్ స్టేషన్, 5 మహిళా పోలింగ్ కేంద్రాలు, యూత్ కోసం ఒక పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఆయన వెంట తహసీల్దార్లు వరప్రసాద్, శ్రీలత, కళాశాల ప్రిన్సిపాల్ గంగాదర్, డీఏవో సువర్ణ ఉన్నారు.