నిజామాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల కోడ్‌ను అమలుచేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జనవరి 29న షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
ఎన్నికల సంఘం చెప్పినట్లు పని చేయడం జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్ల బాధ్యత. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కరీంనగర్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నప్పటికీ నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో అక్కడి కలెక్టర్లే జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తుంటారు.ఎమ్మెల్సీ ఎన్నికలకు అదనపు రిటర్నింగ్ అధికారులుగానూ బాధ్యతలు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియను రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది.
కానీ క్షేత్ర స్థాయిలో ఎన్నికల కోడ్ పూర్తిస్థాయిలో అమలుకావడంలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే వెంటనే జాతీయ నేతల విగ్రహాలకు ముసుగు తొడగడం ఆనవాయితీ. ఈసీ ఎన్నో దశాబ్దాలుగా ఈ నిబంధనను అమలుచేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో మాత్రం అలాంటిదేమీ కనిపించడం లేదు. ఈసీ ఆదేశాలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి వారం రోజులు గడుస్తున్నా, జిల్లా కేంద్రంలోని జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగు తొడగలేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈసీ నిబంధనలను అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ నేతల విగ్రహాలకు ముసుగు వేసి ఎన్నికల కోడ్‌ను అమలు చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంలోనూ నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఐఎంఏ భేటీ కావడం తప్పు కాకపోవచ్చు, కానీ ఐఎంఏలో సభ్యులుగా ఉన్న ప్రభుత్వ వైద్యులు స్వయంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి, బీజేపీ ఎమ్మెల్యేతో భేటీ కావడం ముమ్మాటికి కోడ్ ఉల్లంఘనే.
ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ పత్రికనే వెలుగులోకి తీసుకువచ్చింది. నాడు జిల్లా రిటర్నింగ్ అధికారి స్పం దించి విచారణకు ఆదేశించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ లోతుగా వివరాలు సేకరించి కలెక్టర్‌కు పంపారు. సదరు ఘటనలో నలుగురైదుగురు ప్రభు త్వ వైద్యులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మరుగున పెట్టేయడంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంత వరకూ వారిపై ఎలాంటి చర్య లు తీసుకోకపోవడానికి గల కారణా లు ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. నిజామాబాద్‌లో కొంత మంది ఉన్నతాధికారుల పట్టింపులేని తనం మూలంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈసీ ఆదేశాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ పలు లోపాలు బహిర్గతమవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇందిరాగాంధీ విగ్రహాన్ని పూర్తిగా కాకుండా సగానికే ముసుగేసి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గాలికి వదిలేశారు. తొడుగు వేయలేదు.
ఎన్నికల కోడ్‌ను అమలు చేయలేదు. ఇదేమిటని అడిగే వారు కరువయ్యారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు భాగస్వామ్యపక్షమైన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. ముమ్మాటికీ ఆ విగ్రహానికి ముసుగువేయాల్సి ఉన్నప్పటికీ యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరించడం, జిల్లా ఎన్నికల అధికారులు కనీసం పర్యవేక్షణ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ సీపీ కార్యాలయానికి కూత వేటు దూరంలో, నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుటే ఇంతటి భారీ నిర్లక్ష్యం చోటుచేసుకోవడం గమనార్హం.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డిలో కొందరు జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగువేయలేదు. పట్టణంలోని రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూర్తిగా ముసుగువేయకుండా తలభాగం కనిపించేలా ఉంచారు. దీనిపై అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తగా.. నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ముసుగేశారు..కానీ..’శీర్షికన సోమవారం ఫొటో కథనం ప్రచురితమైంది. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. ఇందిరా గాంధీ విగ్రహానికి పూర్తిగా ముసుగువేశారు.
-కామారెడ్డి, ఫిబ్రవరి 3