ఆర్మూర్, జూలై19 : వృద్ధులైన అక్కాచెల్లెళ్లను దారుణంగా హతమార్చి ఆపై ఇంటికి నిప్పుపెట్టిన సంఘటన ఆర్మూర్ పట్టణంలో కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మగ్గిడి గ్రామానికి చెందిన రాజవ్వ (72), గంగవ్వ (62) అనే అక్కాచెల్లెళ్లు 20 ఏండ్లుగా పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. గంగవ్వ భర్త ఇటీవల మృతి చెందాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దుబాయ్‌లో ఉండగా, చిన్న కుమారుడు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అందరూ కలిసి ఆదివారం మల్లన్న గుట్ట వద్ద నిర్వహించిన పండుగలో పాల్గొన్నారు. సోమవారం మామిడిపల్లిలోనే ఉన్న రాజవ్వ, గంగవ్వను మంగళవారం కుమారుడు జిరాయత్‌నగర్‌లో వారి నివాసం వద్ద వదిలిపెట్టాడు. బుధవారం వేకువజామున ఇంట్లో నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కిటికీలు బద్దలు కొట్టి మంటలు ఆర్పే క్రమంలో అక్కాచెల్లెళ్లు హత్యకు గురైనట్లు గమనించి ఆర్మూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి తలలపై మోది హత్య చేసిన అనంతరం నిప్పు పెట్టినట్లు భావిస్తున్నారు. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు, ఎస్‌హెచ్‌వో సురేశ్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆనంతరం క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు ఆధారాలను సేకరించాయి. వీరిద్దరి ఒంటిపై సుమారు 20 నుంచి 25 తులాల వరకు బంగారం ఉంటుందని స్థానికులు తెలిపారు. నగల కోసమే దుండగులు వీరిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.