పొతంగల్, సెప్టెంబర్ 11: డ్వాక్రా సంఘం సభ్యుల డబ్బులను తన సొంతానికి వాడుకొని, తిరిగి ఇవ్వకపోవడంతో సీఎస్పీ (కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వాహకురాలి ఇంటికి తాళం వేసి వేలం నిర్వహించారు. ఈ ఘటన పొతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామంలోని కెనరా బ్యాంకులో సంధ్య అనే మహిళ సీఎస్పీ నిర్వాహకురాలిగా పనిచేస్తోంది.
డ్వాక్రా మహిళలు బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించిన కిస్తులను ప్రతినెలా సీఎస్పీ నిర్వాహకురాలికి చెల్లించగా..వాటిని ఆమె తన సొంతానికి వాడుకున్నది. సుమారు రూ. 45లక్షలు తన సొంతానికి వాడుకున్న విషయం జూలై 16న బయటపడింది. దీంతో డ్వాక్రా సంఘ సభ్యులు నిలదీయడంతో డబ్బులను తాను సొంతానికి వాడుకున్నట్లు ఒప్పుకున్నది. తనకు తిరిగి చెల్లించడానికి గడువు ఇవ్వాలని గ్రామ పెద్దల సమక్షంలో కోరగా..అందుకు సమ్మతించారు. ఇచ్చిన గడువు ముగియడంతో గ్రామ పెద్దలు, డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఆమె ఇంటిని బుధవారం వేలం వేశారు.
వేలంలో అదే గ్రామానికి చెందిన ఒకరు రూ. 14.80 లక్షలకు దక్కించుకున్నట్ల ఐకేపీ సిబ్బంది తెలిపారు. అయితే నోట్‌పై సంతకం పెట్టడానికి సీఎస్పీ నిర్వాహకురాలి భర్త నిరాకరించడంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. ఎట్టకేలకు సంతకం పెట్టడంతో గొడవ సద్దుమణిగింది. కొద్ది రోజుల క్రితం మొదటగా సీఎస్పీ నిర్వాహకులు 6లక్షల రూపాయలు చెల్లించగా.. మిగతా డబ్బుల కోసం ఆమె ఖాతాలో ఉన్న జమ, గోల్డ్‌లోన్ సంబంధిత వివరాలు డ్వాక్రా సంఘం మహిళలు ఆరా తీసినట్లు తెలిసింది.