పెద్ద కొడప్గల్, అక్టోబర్ 5: వింత వ్యాధితో మూగ జీవాలు మృత్యవాత పడుతున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే 13 ఆవులు మృతి చెందాయి. పెద్దకొడప్గల్ మండలంలో వ్యాపిస్తున్న ఈ వ్యాధి పశువుల యజమానులను కలవరపెడుతున్నది. టీకారం తండాలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. ఇక్కడ వారంలో 13 ఆవులు, 2 దూడలు చనిపోయాయి. అయినా ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పశువైద్యాధికారులు పట్టించుకోవడం లేదని తండా వాసులు వాపోతున్నారు. గోపాల మిత్రలకు చూపించినా ఫలితం లేకపోయింది. రైతులు 1962కు కాల్ చేస్తే కొందరు వచ్చి చూసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి రోజుకు ఒకటి, రెండు ఆవులు మృత్యువాత పడుతూనే ఉన్నాయి.
తండాలో400లకు పైనే ఆవులు ఉండగా, వ్యాధి క్రమంగా విస్తరిస్తున్నది. ఒక్క మోహన్‌సింగ్‌కు చెందిన 15 జీవాలు వారం వ్యవధిలో చనిపోయాయి. పశువుల శరీరం నిండా దద్దుర్లు ఏర్పడి, పుండ్లుగా మారి జీవాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. మేత తినలేక, నడువలేక నీరసించి మృత్యువాత పడుతున్నాయి. కండ్ల ముందే తమ పశువులు కనుమూస్తుండడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మరోవైపు, పాలిచ్చే ఆవులు చనిపోతుండడంతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతున్నది.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రభుత్వ వైద్యులు రావడం లేదని పశు పోషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వెటర్నరీ డాక్టరీ పండరినాథ్‌కు గురువారం ఫోన్ చేస్తే, శుక్రవారం శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. కానీ రెండ్రోజులుగా ఇటువైపు రాలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక పోతే జీవాలన్నీ జీవచ్ఛవాలుగా మారుతాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసి తమ ఆవులను కాపాడాలని విన్నవిస్తున్నారు. మరోవైపు, వ్యాధి తీవ్రత, నివారణ, శిబిరాల ఏర్పాటుపై వివరణ కోరేందుకు స్థానిక పశు వైద్యాధికారి పండరినాథ్‌కు ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ చేయగా, ఆయన స్పందించలేదు.
మా తండాలో ఆవులకు ఏ వ్యాధి వచ్చిందేమో అర్థమైతలేదు. నాకు 60 దాకా ఆవులు ఉన్నాయి. అందులో రోజుకు ఒకటి, రెండు చొప్పున సచ్చిపోతున్నాయి. ఈ వారంల 13 ఆవులు, 2 దూడలు సచ్చిపోయినయ్. పశువుల డాక్టర్‌కు చెబితే పట్టించుకుంటలేడు. ప్రైవేట్ వైద్యులకు చూపించినా వ్యాధి తగ్గుతలేదు. ఉన్నతాధికారులు స్పందిస్తేనే మా జీవాలు మాకు దక్కుతాయి. లేకుంటే ఇప్పుడు మిగిలనవి కూడా సచ్చిపోతాయ్.
– బర్దవాల్ మోహన్‌సింగ్, టీకారం తండా