Nizamabad | వినాయక నగర్, డిసెంబర్ 22 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో కలిసి నగరంలోని కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన ఓ కారును నిలిపి ట్రాఫిక్ పోలీసులు అందులో ఉన్న వ్యక్తికి బ్రీతింగ్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించారు.
దీంతో సదరు వ్యక్తి డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సీఐని నెట్టివేయడంతో పాటు ఆర్ఎస్ఐపై భౌతిక దాడికి పాల్పడినట్టు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. దీంతో సదరు వ్యక్తి మద్య మత్తులో ట్రాఫిక్ సిబ్బంది పై తిరగబడి విధులకు ఆటంకం కలిగించాడని మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ఐ ఫిర్యాదు చేశారు. నెల కల్ రోడ్డు ప్రాంతానికి చెందిన పిట్ల సాయిలు అనే సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు మూడో టౌన్ ఇన్చార్జ్ ఎస్ఐ నారాయణ తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పది రోజుల జైలు శిక్ష : ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ వెల్లడి
డ్యూటీలో ఉన్న వారి విధులకు ఆటంకం కలిగించేవారెంతటి వారైనా ఉపేక్షించమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ మస్తాన్ అలీ హెచ్చరించారు. డ్యూటీలో ఉన్న తమ సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడిన ఇట్ల సాయిలు అనే వ్యక్తిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. దీంతో అతనికి పది రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారని ఏసీపీ వెల్లడించారు.