డిచ్పల్లి, ఆగస్టు 4: గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనున్నది. పల్లెలను అనుసంధానం చేసే రోడ్లతోపాటు వంతెనల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చొరవతో ఇరుకు రోడ్లకు స్వస్తి పలికి విశాలమైన రోడ్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక్కో గ్రామాన్ని కలుపుతూ బీటీ రోడ్లను వేయగా, ప్రస్తుతం రెండు వరుసల రోడ్లను వేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారనున్నాయని ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జక్రాన్‌పల్లి మండలవాసుల చిరకాల కోరిక అయిన డబుల్ రోడ్డు, వంతెన నిర్మాణం పనులకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థన మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రూ.22.50కోట్లు మంజూరు చేశారు. దీంతో జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారి పడకల్తండా నుంచి చేంగల్ గ్రామాల వరకు సుమారు 15కిలోమీటర్ల మేర ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇరుకురోడ్డుతో అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత ప్రజలకు డబుల్ రోడ్డు నిర్మాణంతో ప్రయాణ సౌకర్యం సులువుగా మారనున్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే జక్రాన్‌పల్లి మండలానికి డబుల్ రోడ్డు నిర్మాణానికి 18.50 కోట్లు, మనోహరాబాద్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4కోట్లు మంజూరయ్యాయి. దీంతో డబుల్ రోడ్డు నిర్మాణం పనులు, వంతెన నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తయితే జక్రాన్‌పల్లి నుంచి భీమ్‌గల్ వరకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడడంతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. రోడ్డు నిర్మాణంతో పడకల్ తండా, పడకల్, కలిగోట్, చింతలూరు, చేంగల్ గ్రామాలకు చెందిన ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తీరనున్నాయి.
ఆర్టీసీ చైర్మన్‌కు రుణపడి ఉంటాం
మేము అడిగిన వెంటనే సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డిని ఒప్పించి రూ.22 కోట్లు జక్రాన్‌పల్లి మండలానికి మంజూరు చేయించడం సంతోషంగా ఉన్నది. ఆర్టీసీ చైర్మన్‌కు జక్రాన్‌పల్లి మండల ప్రాంత వాసులు ఎంతో రుణపడి ఉంటారు. అడగకుండానే రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు అండగా ఉంటాం.
– కాటిపల్లి చేతనారెడ్డి, సర్పంచ్, కలిగోట్
నిధుల మంజూరు హర్షణీయం..
జక్రాన్‌పల్లి మండల కేంద్రం నుంచి భీమ్‌గల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు రూ.18.50 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. ఎన్నో ఏండ్లుగా సింగిల్ రోడ్డుతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక కృషితో డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు కావడంతో సంతోషంగా ఉన్నది.
– సుకన్య ప్రసాద్, సర్పంచ్, చింతలూరు