CDPO Padma | కోటగిరి, జనవరి 7 : బాలురు బాలికల మధ్య సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందని, లింగ వివక్ష చూపొద్దని ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు సీడీపీవో పద్మ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో యువ కిశోర బాలురకు లింగ సమానత్వంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో-బేటి పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా-శిశు-వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఈ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ బోధన ప్రాజెక్టు సీడీపీవో పద్మ హాజరై మాట్లాడారు. బాలురు-బాలికల మధ్య సమానత్వం పాటించాల్సిన అవసరాన్ని వివరించి భవిష్యత్లో బాలుర పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. జిల్లా మిషన్ కో-ఆర్డినేటర్ స్వప్న మాట్లాడుతూ బేటి బచావో-బేటీ పడావో కార్యక్రమ లక్ష్యాలను వివరించారు.
లింగ వివక్షత నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఏఆర్ ఎడ్యుకేషన్ శిక్షకురాలు శిరీష మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న లింగ వివక్షత అంశాలను ఉదాహరణలతో వివరించారు. బాలురు-బాలికల మధ్య సమాన హక్కులు, గౌరవం, పరస్పర అవగాహన గురించి వివరించడంతో పాటు మహిళలు, బాలికలపై వివక్ష హింసను నివారించడంలో బాలురు పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్యవివాహాలు బాలలపై దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలపై చర్చించి సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో యువత బాధ్యతను గుర్తు చేశారు.
ఈ శిక్షణ ద్వారా యువ కిశోర బాలురలో సానుకూల ధృక్పథం పెరిగి, లింగ సమానత్వాన్ని పాటించే సమాజ నిర్మాణానికి వారు తోడ్పడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీసీఎస్ కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలాల సూపర్ వైజర్లు కొమురవ్వ, వెంకటరమణ, శ్రీలత, షీ టీం ఆశన్న, సునీత, స్కూల్ ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలిక్, సౌమ్య, అంగన్వాడీ టీచర్లు కృష్ణకుమారి, కళావతి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.