కామారెడ్డి, జూలై 6: అనుకోకుండా వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్న వివాహిత. పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు.. వెరసి నవజాత శిశువును వి క్రయించిన కేసులో ప్రభుత్వ వైద్యుడు సహా ఎనిమిది మందిని కామారెడ్డి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాలను పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం విలేకరులకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు, రామారెడ్డి మండలం పోసానిపేట్‌కు చెందిన మహేశ్‌తో గత ఫిబ్రవరిలో వివా హం జరిగింది. అయితే, పెండ్లికి ముందే గర్భి ణి అయిన లావణ్య భర్తకు తెలియకుండా గర్భాన్ని తీయించుకోవాలనుకున్నది.
ఈ నేపథ్యంలోనే కామారెడ్డిలోని శ్రీరామనగర్ కాలనీలో ఉన్న సమన్విత దవాఖానలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఉదయ్‌కిరణ్ ద్వారా వైద్యులు ఇట్టం నడిపి సిద్దిరాములు, ప్రవీణ్‌కుమార్ (తండ్రీకుమారులు)ను ఏప్రిల్ నెలలో సంప్రదించింది. అప్పటికే ఎనిమిది నెలల గర్భిణి అయిన ఆమె.. తనకు బిడ్డ వద్దని చెప్పడంతో డాక్టర్లు సరేనన్నారు. అం దుకు గాను రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీన లావణ్య కు పురిటి నొప్పులు వచ్చే ఇంజక్షన్లు చేయగా, సాధారణ ప్రసవం ద్వారా ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకా రం లావణ్య మేనేజర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.80 వేలు, నగదుగా రూ.50 వేలు చెల్లిం చి తప్పుకున్నది. అయితే, శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు డాక్టర్లు మరో దవాఖానకు తరలించి వైద్యం చేయించారు.
అనంతరం డాక్టర్ సిద్దిరాములు తనకు పరిచయస్తుడైన రాజంపేటకు చెందిన బాలకిషన్‌ను సంప్రదించి, ఆడశిశువు ఉందని, ఎవరికైనా కావాలంటే చెప్పాలని సూచించాడు. దీంతో ఆయన తన బంధువు, సిరిసిల్లకు చెందిన బాలకిషన్‌కు సమాచారం ఇచ్చాడు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతికి పిల్లలు లేకపోవడంతో ఆయన శిశువును తీసుకునేందుకు దేవయ్యతో రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరోవైపు, పైండ్లెన రెండు నెలలకే తన భార్య గర్భం దాల్చడం, ఎనిమిది నెల ల గర్భవతి కావడంపై అనుమానం వచ్చిన భర్త మహేశ్, సదరు దవాఖానకు వెళ్లి విచారించగా బాగోతం బయటపడింది. దీంతో ఆయన 1098కు కాల్ చేసి ఫిర్యాదు చేయ గా, కామారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రం గంలోకి దిగారు. శిశువును విక్రయించినట్లు తేలడంతో చైల్డ్ ఆఫీసర్ స్రవంతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కూపీ లాగారు. పసిపాపను విక్రయించిన కేసులో డాక్టర్లు సిద్దిరాములు, ప్రవీణ్‌కుమార్, మేనేజర్ ఉదయ్‌కిరణ్, వాచ్‌మన్ బాలరాజు, తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్యతోపాటు చిన్నారిని కొనుగోలు చేసిన భూపతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
గతంలోనూ కేసులు..
డాక్టర్ సిద్దిరాములుపై గతంలోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. కౌసల్య మల్టీస్పెషాలిటీ పేరుతో దవాఖాన నడిపిన ఆయన లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతో అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది. కేసు విచారణలో భాగంగా దవాఖానకు వెళ్లిన పోలీసులకు సిద్దిరాములు లింగ నిర్ధారణతోపాటు చట్టవిరుద్ధంగా అబార్షన్లు కూడా చేస్తారని తెలిసింది. మరోవైపు, అదే సిద్దిరాములు ప్రస్తుత కేసులోనూ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఆయన కుమారుడు, గాం ధారి ప్రభుత్వ దవాఖానలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేసే డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సైతం ఈ కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాపను చైల్డ్ వెల్ఫేర్ శాఖకు అప్పగించామని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే బాధితులు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు.