Carden Search | ఎల్లారెడ్డి రూరల్, జులై 19 : ఏమాత్రం ముఖ పరిచయం లేని కొత్తవారికి ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని, వారు మరెక్కడైనా తప్పులు చేసి వచ్చిన వారై ఉండొచ్చని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చ కాలనీలో ఆదివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో కలిసి పలు నివాస గృహాలను తిరిగి వారి వివరాలను, వారి వాహనాల వివరాలను పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను కాలనీ మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయం వద్దకు పోలీసులు తీసుకువచ్చి ఉంచారు. సుమారు రెండు గంటల పాటు కొనసాగింది.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎవరైనా వాహనాలను విక్రయిస్తే వెంటనే పేరు మార్పిడీ చేసుకోవాలని, లేనిచో ఆ వాహనాలు తీసుకున్నవారు ఏదైనా యాక్సిడెంట్ చేసినా, తప్పుడు వ్యవహారాలలో పాల్గొన్నా.. వాహనం ఎవరి పేరుతో ఉందో వారికి ఇబ్బందులు తప్పవన్నారు. కాలనీలలో ఎప్పుడైనా ఎక్కడైనా కొత్తవారు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీవాసులు ఏమాత్రం భయపడేది లేదని, మీకు అండగా మేమున్నామని తెలుపడానికి కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడానికి నేరస్తులను గుర్తించడానికి ప్రజలలో భద్రతాభావనను పెంచడానికి కార్డెన్ సెర్చ్ ఉపయోగపడుతుందన్నారు.
సరైన ధ్రువపత్రాలు చూపించిన వారికి వాహనాలను అప్పగిస్తామని, ఎటువంటి ఆధారాలు, ధృవపత్రాలు లేని వాహనాలను స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. తనిఖీలలో భాగంగా నిబంధనల ప్రకారం లేని 135 ద్విచక్ర వాహనాలు, ఎనిమిది త్రి చక్రాల వాహనాలు, 4 నాలుగు చక్రాల వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కార్యక్రమంలో ఆయనతోపాటు ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, సబ్ డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి మండలాల ఎస్సైలు రాజు, భార్గవ్ గౌడ్, దీపక్ కుమార్, నరేష్, సిద్ధిఖీ, మహేందర్, ఎల్లారెడ్డి ఎస్ఐ-2 సుబ్రహ్మణ్య చారి, ఏఎస్ఐ దేవ గౌడ్‌తో పాటు ఆయా మండలాలకు చెందిన పోలీస్ సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు.