ధర్పల్లి/ నిజామాబాద్ రూరల్/ రుద్రూర్/ జనవరి 5 : అయోధ్య రాముడి పూజిత అక్షింతలను జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఇంటింటికీ పంపిణీ చేశారు. ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్‌లో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈనెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి, అక్షింతలను దేవుని వద్ద ఉంచి, కుటుంబసభ్యులపై చల్లాలని సూచించారు. నగరశివారులోని గంగస్థాన్ ఫేస్-2లో శ్రీరామ మహిళా భక్తులు మంగళహారతులతో ఇంటింటికీ పంపిణీ చేశారు. రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి, సులేమాన్‌నగర్‌లో అక్షింతలను యువకులు ఇంటింటికీ పంపిణీ చేశారు. చిక్కడ్పల్లి వీడీసీ అధ్యక్షుడు కుర్మ రాజు, అశోక్, రాజయ్య, ముచ్కూరి అశోక్, సాయన్న పాల్గొన్నారు.
నిజామాబాద్ కల్చరల్, జనవరి 5 : అయోధ్యలో ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సందర్భంగా సాయంత్రం ఇంటింటా దీపావళి జరుపుకోవాలని తెలంగాణ ప్రాంత శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ కన్వీనర్ ఘనపురం రాజేశ్వర్‌రెడ్డి కోరారు. నగరంలోని వీహెచ్‌పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతి హిందువూ తమ ఇంటి ఎదుట 5 దీపాలను వెలిగించాలని కోరారు.
ఆర్మూర్‌టౌన్, జనవరి5: శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అంకాపూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు వారి స్వగృహంలో రాములోరి అక్షింతలను అందజేశారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
బోధన్/రెంజల్/నందిపేట్/ఏర్గట్ల, జనవరి 5: బోధన్ పట్టణంలో అయోధ్య శ్రీరాముడి అక్షింతలతో శోభాయాత్రను నిర్వహించారు. శోభాయాత్ర అనంతరం ఇంటింటికీ తిరుగుతూ అయోధ్య అంక్షితలను అందజేశారు.
రెంజల్ మండలంలోని కందకుర్తి, సాటాపూర్ గ్రామాల్లో అయోధ్య పూజిత అంక్షితలతో శోభాయాత్ర నిర్వహించారు. కందకుర్తిలోని రామాలయంలో పూజలు, హారతి నిర్వహించారు.
నందిపేట్ మండల కేంద్రంలో అయోధ్య పూజిత అక్షింతలను పంపిణీ చేశారు. బీఎస్పీ, భజరంగ్‌దళ్, హిందూ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఆయా వాడల్లో ఇంటింటికీ తిరుగుతూ అయోధ్య పూజిత అక్షింతలను అందించారు.
ఏర్గట్ల, జనవరి 5: మండల కేంద్రంలో గ్రామ యువకులు ఇంటింటికీ అక్షింతలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విఠల్, పిట్ల నరేశ్, కమాని గణేశ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.